1 Chronicles · బైబిల్ (తెలుగు)

1 Chronicles 22

1దావీదు “దేవుడైన యెహోవా నివాసం ఉన్న స్థలం ఇదే. ఇశ్రాయేలీయులు అర్పించే దహనబలులకు స్థానం ఇదే” అని చెప్పాడు. 1 దేవుని మందిరం కట్టించడానికి సిద్ధపాట్లు

2తరువాత దావీదు, ఇశ్రాయేలీయుల దేశంలో ఉన్న అన్యజాతి వాళ్ళను సమకూర్చమని ఆజ్ఞ ఇచ్చి, దేవుని మందిరం కట్టించడానికి రాళ్లు చెక్కేవారుగా వారిని నియమించాడు.

3వాకిలి తలుపులకు కావలసిన మేకులకు, బందులకు భారీగా ఇనుమును, తూయడానికి వీలులేనంత ఇత్తడిని,

4లెక్కలేనన్ని దేవదారు మానులను దావీదు సంపాదించాడు. సీదోనీయులూ, తూరీయులూ దావీదుకు విస్తారమైన దేవదారు మానులను తీసుకు వస్తూ ఉన్నారు.

5దావీదు “నా కొడుకు సొలొమోనుది అనుభవం లేని లేత వయస్సు. యెహోవా కోసం కట్టబోయే మందిరం దాని కీర్తిని బట్టి, అందాన్ని బట్టి, అన్ని దేశాల్లో ప్రసిద్ధి చెందినది, చాలా వైభవోపేతంగా ఉండాలి. కాబట్టి, దానికి కావలసిన సరంజామా అంతటినీ సిద్ధపరుస్తాను” అని చెప్పి, అతడు తన మరణానికి ముందు విస్తారంగా సామగ్రిని సమకూర్చాడు.

6తరువాత అతడు తన కొడుకు సొలొమోనును పిలిపించి, ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవాకు ఒక మందిరం కట్టాలని అతనికి ఆజ్ఞ ఇచ్చాడు.

7దావీదు సొలొమోనుతో “నా కుమారా, నేను నా దేవుడైన యెహోవా నామ ఘనత కోసం ఒక మందిరం కట్టించాలని నా హృదయంలో నిశ్చయం చేసుకొన్నప్పుడు,

8యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై, నువ్వు చాలా రక్తపాతం, చాలా యుద్ధాలు చేసిన వాడివి, నువ్వు నా పేరట మందిరం కట్టించకూడదు, నా దృష్టిలో నువ్వు విస్తారంగా రక్తం చిందించావు.

9నీకు పుట్టబోయే ఒక కొడుకు శాంతిపరుడు. చుట్టూ ఉండే అతని శత్రువులందరిని నేను తోలివేసి అతనికి శాంతిసమాధానాలు కలగజేస్తాను. ఆ కారణంగా అతనికి సొలొమోను అను పేరు ఉంటుంది. అతని కాలంలో ఇశ్రాయేలీయులకు శాంతి సమాధానాలు, విశ్రాంతి దయచేస్తాను.

10అతడు నా పేరట ఒక మందిరం కట్టిస్తాడు, అతడు నాకు కొడుకుగా ఉంటాడు. నేనతనికి తండ్రిగా ఉంటాను, ఇశ్రాయేలీయుల మీద అతని రాజ్య సింహాసనాన్ని నిత్యం స్థిరపరుస్తాను, అన్నాడు.

11నా కుమారా, యెహోవా నీకు తోడుగా ఉంటాడు గాక. నువ్వు వర్ధిల్లి నీ దేవుడు యెహోవా నీ గురించి చెప్పిన ప్రకారం ఆయనకు మందిరం కట్టిస్తావు.

12నీ దేవుడు యెహోవా ధర్మశాస్త్రాన్ని అనుసరించేలా యెహోవా నీకు వివేకమూ తెలివీ ఇచ్చి, ఇశ్రాయేలీయుల మీద నీకు అధికారం దయచేస్తాడు గాక.

13యెహోవా ఇశ్రాయేలీయులను గూర్చి మోషేకు ఇచ్చిన కట్టడల ప్రకారంగా, ఆయన తీర్చిన తీర్పుల ప్రకారంగా, లోబడడానికి జాగ్రత్త పడితే నీవు వృద్ధి పొందుతావు. ధైర్యం తెచ్చుకుని బలంగా ఉండు. భయపడొద్దు, దిగులు పడొద్దు.

14చూడు, నేను చాలా బాధ తీసుకుని యెహోవా మందిరం కోసం మూడు వేల నాలుగు వందల యాభై టన్నుల బంగారం, ముప్ఫై నాలుగు వేల ఐదు వందల టన్నుల వెండీ, తూయడానికి వీలు కానంత విస్తారమైన ఇత్తడీ, ఇనుమూ సమకూర్చాను. మానులను, రాళ్లను తెచ్చి పెట్టాను. దీని కన్నా మరింత ఎక్కువగా నువ్వు సమకూరుస్తావు గాక.

15ఇంకా, పని చేయగలిగిన ఎందరో శిల్పకారులూ తాపీ పనివాళ్ళూ వడ్రంగులు, నిపుణులైన పనివాళ్ళు నీ దగ్గర ఉన్నారు.

16లెక్కకు మించిన బంగారం, వెండి, ఇత్తడి, ఇనుము నీదగ్గర ఉంది. కాబట్టి నువ్వు పనికి పూనుకో, యెహోవా నీకు తోడుగా ఉంటాడు” అన్నాడు.

17దావీదు తన కొడుకు సొలొమోనుకు సాయం చెయ్యాలని ఇశ్రాయేలీయుల అధిపతులందరికీ ఆజ్ఞాపించాడు.

18అతడు వారితో “మీ దేవుడు యెహోవా మీతో ఉన్నాడు గదా? మీ సరిహద్డులంతటా ఆయన మీకు శాంతినిచ్చాడు గదా? దేశనివాసులను ఆయన నా వశం చేశాడు. యెహోవా భయం వల్ల, ఆయన ప్రజల భయం వల్ల దేశం స్వాధీనం అయింది.

19కాబట్టి, హృదయపూర్వకంగా మీ దేవుడు యెహోవాను కోరుకోడానికి మీ మనస్సులు దృఢపరచుకుని, ఆయన నిబంధన మందసాన్ని, దేవునికి ప్రతిష్ఠితమైన ఉపకరణాలను, ఆయన పేరు కోసం కట్టే ఆ మందిరంలోకి చేర్చడానికి మీరు పూనుకుని దేవుడైన యెహోవా పరిశుద్ధ స్థలాన్ని కట్టండి” అన్నాడు.

← 1 Chronicles 21Read In The App, Free →1 Chronicles 23 →

Study 1 Chronicles 22

KJVMatthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)Reina-Valera (Español)Bíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)

All Chapters

1234567891011121314151617181920212223242526272829