1 Corinthians · బైబిల్ (తెలుగు)

1 Corinthians 9

1నాకు స్వేచ్ఛ లేదా? నేను అపొస్తలుణ్ణి కాదా? మన ప్రభు యేసును నేను చూడలేదా? మీరు ప్రభువులో నా పనితనానికి ఫలితం కారా?

2నేను ఇతరులకి అపొస్తలుణ్ణి కాకపోయినా కనీసం మీకైనా అపొస్తలుడినే కదా. ప్రభువులో నా అపొస్తలత్వానికి మీరే రుజువు.

3నాపై నిందారోపణ చేసే వారికి నేనిచ్చే జవాబు ఇదే.

4తినటానికీ తాగటానికీ మాకు అధికారం లేదా?

5మిగతా అపొస్తలులు, ప్రభువు సోదరులు, కేఫా, వీరందరిలాగా విశ్వాసురాలైన భార్యను తీసుకుని తిరగడానికి మాకు అధికారం లేదా?

6బర్నబా, నేను మాత్రమే పని చేస్తూ ఉండాలా? 1 సువార్త ప్రకటించేవారి జీవనోపాధి సువార్త వల్లనే

7ఎవరైనా సైనికుడు తన ఖర్చులు తానే భరిస్తూ సైన్యంలో పని చేస్తాడా? ద్రాక్షతోట వేసి దాని పండ్లు తినని వాడెవడు? పశువుల మందను పోషిస్తూ వాటి పాలు తాగని వాడెవడు?

8ఈ మాటలు నేను మానవ అధికారంతో చెబుతున్నానా? ధర్మశాస్త్రం కూడా ఇదే చెబుతున్నది కదా?

9“ధాన్యపు కళ్ళం తొక్కే ఎద్దు మూతికి చిక్కం పెట్టవద్దు” అని మోషే ధర్మశాస్త్రంలో రాసి ఉంది. దేవుడు కేవలం ఎడ్ల గురించేనా ఇక్కడ రాస్తున్నది?

10నిజానికి ఆయన కచ్చితంగా మన కోసం దీన్ని చెప్పడం లేదా? అవును, ఈ మాట మన కోసమే రాసి ఉంది. ఎందుకంటే, దున్నేవాడు ఆశతో దున్నాలి. కళ్ళం తొక్కించేవాడు పంటలో భాగం పొందుతాను అనే ఆశతో ఆ పని చేయాలి.

11మీ కోసం మేము ఆధ్యాత్మిక విషయాలు విత్తనాలుగా చల్లాము. దానికి ప్రతిఫలంగా మీ నుండి శరీర సంబంధమైన పంట కోసుకోవడం గొప్ప విషయమేమీ కాదు.

12వేరే వారికి మీ మీద ఈ అధికారం ఉందంటే మాకు మరి ఎక్కువ అధికారం ఉంటుంది కదా? అయితే మేము ఈ అధికారాన్ని ఉపయోగించుకోలేదు. క్రీస్తు సువార్తకు ఏ విధమైన ఆటంకమూ కలిగించకుండా ఉండడం కోసం అన్నిటినీ సహిస్తున్నాం.

13దేవాలయంలో పని చేసేవారు తమ జీవనోపాధిని ఆలయం నుండే పొందుతారు. బలిపీఠం దగ్గర కనిపెట్టుకుని ఉండేవారు ఆ బలిపీఠం మీద అర్పించిన వస్తువుల్లో పాలిభాగస్తులు అని మీకు తెలియదా?

14అదే విధంగా సువార్త ప్రకటించేవారు సువార్త ద్వారానే తమ జీవనోపాధిని పొందాలని ప్రభువు నియమించాడు.

15అయితే వీటిలో దేనినీ నా హక్కుగా నేను వినియోగించుకోలేదు. మీరు నా విషయంలో ఈ విధంగా చేయాలని చెప్పడానికి నేను ఈ సంగతులు రాయడం లేదు. ఈ విషయంలో నా అతిశయాన్ని ఎవరైనా తక్కువగా చూస్తే, అంతకంటే నాకు మరణమే మేలు.

16నేను సువార్త ప్రకటించడంలో గర్వించడానికి నాకు కారణం ఏమీ లేదు. ఎందుకంటే అది నాకు తప్పనిసరి బాధ్యత. అయ్యో, నేను సువార్త ప్రకటించకపోతే నాకు యాతన.

17దాన్ని నేను ఇష్టపూర్వకంగా చేస్తే నాకు బహుమానం దొరుకుతుంది. ఒకవేళ నాకు ఇష్టం లేకపోయినా ప్రభువు ఆ బాధ్యతను నాకు అప్పగించాడు.

18అలాటప్పుడు నాకు బహుమానం ఏమిటి? నేను సువార్త ప్రకటిస్తున్నప్పుడు దానిలో నాకున్న హక్కులను పూర్తిగా వాడుకోకుండా సువార్తను ఉచితంగా ప్రకటించడమే నా బహుమానం. 1 నిజమైన సేవావిధానం, ప్రతిఫలం

19నేను స్వేచ్ఛాజీవిని, ఎవరికీ బానిసను కాను. అయితే నేను ఎక్కువమందిని సంపాదించుకోడానికి అందరికీ నన్ను నేనే సేవకునిగా చేసుకున్నాను.

20యూదులను సంపాదించడానికి యూదునిలాగా ఉన్నాను. ధర్మశాస్త్రాన్ని పాటించే వారిని సంపాదించడానికి నాకై నేను దాని కింద లేకపోయినా, ధర్మశాస్త్రానికి లోబడినట్టుగా ఉన్నాను.

21దేవుని విషయంలో ధర్మశాస్త్రం లేని వాణ్ణి కాదు, క్రీస్తుకు చెందిన ధర్మశాస్త్రం నాకుంది. అయినా, ధర్మశాస్త్రం లేని వారిని సంపాదించడానికి వారి విషయంలో ధర్మశాస్త్రం లేనట్టుగానే ఉన్నాను.

22బలహీనులను సంపాదించుకోడానికి వారికి బలహీనుడినయ్యాను. ఏ విధంగా నైనా కొందరిని రక్షించాలని అందరికీ అన్నివిధాలుగా ఉన్నాను.

23సువార్త కోసం నేను ఏమైనా చేస్తాను. తద్వారా దాని ఫలంలో పాలివాణ్ణి కావాలని నా వాంఛ.

24పరుగు పందెంలో పాల్గొనే వారంతా పరిగెత్తుతారు గాని బహుమానం మాత్రం ఒక్కడికే లభిస్తుంది అని మీకు తెలుసు కదా! కాబట్టి అదేవిధంగా మీరు బహుమానం పొందాలని పరుగెత్తండి.

25అంతే కాక పందెంలో పరిగెత్తే ప్రతి ఒక్కడూ అన్ని విషయాల్లో ఆత్మనిగ్రహం కలిగి ఉంటాడు. వారు త్వరగా ఎండిపోయి వాడి పోయే ఆకుల కిరీటం కోసం పరిగెత్తితే, మనం అక్షయమైన కిరీటం కోసం ఆత్మ నిగ్రహంతో పరిగెత్తుతాము.

26కాబట్టి నేను గమ్యం లేని వాడిలా పరుగెత్తను. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడడం లేదు.

27ఇతరులకు ప్రకటించిన తరువాత ఒక వేళ నేనే అర్హత కొల్పోతానేమోనని నా శరీరాన్ని నలగగొట్టి, దాన్ని నాకు లోబరచుకొంటున్నాను.

← 1 Corinthians 8Read In The App, Free →1 Corinthians 10 →

Study 1 Corinthians 9

KJVMatthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeAlbert BarnesJohn WesleyJohn CalvinScofieldWilliam BurkittFamily Bible NotesJohn LightfootGeneva Bible Notes (1599)Reina-Valera (Español)Bíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)

All Chapters

12345678910111213141516