1 Kings · బైబిల్ (తెలుగు)

1 Kings 13

1ఒక దైవ సేవకుడు యెహోవా మాట చొప్పున యూదాదేశం నుండి బేతేలుకు వచ్చాడు. ధూపం వేయడానికి యరొబాము ఆ బలిపీఠం దగ్గర నిలబడి ఉన్నాడు.

2ఆ దైవ సేవకుడు యెహోవా ఆజ్ఞ ప్రకారం బలిపీఠానికి వ్యతిరేకంగా ఇలా ప్రకటన చేశాడు. “బలిపీఠమా! బలిపీఠమా! యెహోవా చెప్పేదేమిటంటే, దావీదు సంతానంలో యోషీయా అనే పేరుతో ఒక మగ బిడ్డ పుడతాడు. నీ మీద ధూపం వేసిన ఉన్నత పూజా స్థలాల యాజకులను అతడు నీ మీద వధిస్తాడు. అతడు మనిషి ఎముకలను నీ మీద కాలుస్తాడు.”

3అదే రోజు అతడు ఒక సూచన ఇచ్చాడు. “ఈ బలిపీఠం బద్దలై దానిమీదున్న బూడిద ఒలికి పోతుంది. యెహోవా చెప్పిన సూచన ఇదే” అన్నాడు.

4బేతేలులోని బలిపీఠాన్ని గురించి ఆ దైవ సేవకుడు ప్రకటించిన మాట యరొబామురాజు విని, బలిపీఠం మీదనుండి తన చెయ్యి చాపి “అతన్ని పట్టుకోండి” అన్నాడు. అతడు చాపిన చెయ్యి చచ్చుబడి పోయింది. అతడు దాన్ని తిరిగి వెనక్కి తీసుకోలేకపోయాడు.

5యెహోవా మాట ప్రకారం దైవసేవకుడి మాట ప్రకారం బలిపీఠం బద్దలై, దాని మీద నుండి బూడిద ఒలికి పోయింది.

6అప్పుడు రాజు “నా చెయ్యి తిరిగి బాగయ్యేలా నీ దేవుడు యెహోవా నా మీద దయ చూపేలా నా కోసం వేడుకో” అని ఆ దేవుని మనిషితో అన్నాడు. కాబట్టి దైవ సేవకుడు యెహోవాను వేడుకున్నాడు. రాజు చెయ్యి బాగై మునుపటి లాగా అయింది.

7అప్పుడు రాజు “నీవు నా ఇంటికి వచ్చి అలసట తీర్చుకో. నీకు బహుమతి ఇస్తాను” అని ఆ దైవసేవకుడితో చెప్పాడు.

8అప్పుడు దైవ సేవకుడు రాజుతో ఇలా అన్నాడు “నీవు నీ ఇంట్లో సగం నాకిచ్చినా నీతోబాటు నేను లోపలికి రాను. ఇక్కడ నేనేమీ తినను, తాగను.

9ఎందుకంటే, ఇక్కడేమీ తినొద్దనీ తాగొద్దనీ వచ్చిన దారినే తిరిగి వెళ్ళవద్దనీ యెహోవా నాకు ఆజ్ఞాపించాడు.”

10అందుకని అతడు బేతేలుకు వచ్చిన దారిన కాకుండా ఇంకొక దారిలో వెళ్ళిపోయాడు.

11బేతేలులో ఒక ముసలి ప్రవక్త నివసించేవాడు. అతని కొడుకుల్లో ఒకడు వచ్చి బేతేలులో ఆ దైవ సేవకుడు ఆ రోజు చేసినదంతా అతనికి చెప్పాడు. అతడు రాజుతో చెప్పిన మాటలు కూడా అతని కొడుకులు అతనికి చెప్పారు.

12వారి తండ్రి “అతడు ఏ దారిన వెళ్ళాడు?” అని వారినడిగాడు. అతని కొడుకులు యూదాదేశాన్నుంచి వచ్చిన దేవుని మనిషి ఏ దారిలో వెళ్ళాడో చెప్పారు.

13తరువాత అతడు తన కొడుకులను పిలిచి “నాకోసం గాడిద మీద జీను వేయండి” అని చెప్పాడు. వారు అతని కోసం గాడిదపై జీను వేశారు. అతడు దాని మీద ఎక్కి బయలుదేరాడు.

14సింధూర వృక్షం కింద దేవుని మనిషి కూర్చుని ఉండగా చూసి “యూదాదేశం నుండి వచ్చిన దైవ ప్రవక్తవు నువ్వేనా?” అని అడిగాడు. అతడు “నేనే” అన్నాడు.

15అప్పుడు అతడు “నా ఇంటికి వచ్చి భోజనం చెయ్యి” అన్నాడు.

16అతడు “నేను నీతో రాలేను. నీ ఇంటికి రాను. నీతో కలిసి ఇక్కడ ఏదీ తిననూ తాగను.

17నీవు అక్కడ ఏదీ తినొద్దనీ తాగొద్దనీ నీవు వచ్చిన దారిలో వెళ్ళ వద్దనీ యెహోవా నాతో చెప్పాడు” అన్నాడు.

18అప్పుడు ఆ ముసలి ప్రవక్త అతనితో “నేను కూడా నీలాంటి ప్రవక్తనే. యెహోవా ఆజ్ఞ ప్రకారం ఒక దేవదూత ‘భోజనం చేయడానికి అతన్ని వెంటబెట్టుకుని తీసుకు రా’ అని నాతో చెప్పాడు” అన్నాడు. అలా అతడు ఆ దేవుని మనిషితో అబద్ధమాడాడు.

19అతడు ఆ ముసలి ప్రవక్త వెంట వెళ్లి అతని ఇంట్లో భోజనం చేశాడు.

20వారు భోజనం చేస్తూ ఉంటే అతన్ని వెనక్కి తీసుకొచ్చిన ఆ ప్రవక్తతో యెహోవా మాట్లాడాడు.

21అతడు యూదాదేశాన్నుండి వచ్చిన దేవుని మనిషితో “యెహోవా ఇలా చెబుతున్నాడు, నీ దేవుడు యెహోవా నీకు చెప్పిన మాట వినక, ఆయన ఆజ్ఞాపించిన దాన్ని పాటించకుండా

22వెనక్కి వచ్చి, నీవు అక్కడ భోజనం చేయొద్దని ఆయన చెప్పిన చోట భోజనం చేశావు కాబట్టి నీ శవాన్ని నీ పూర్వీకుల సమాధులకు చేరదు” అని బిగ్గరగా చెప్పాడు.

23వారు భోజనం చేసిన తరువాత ఆ ప్రవక్త తాను వెనక్కి తీసుకు వచ్చిన ఆ దైవసేవకుని గాడిదపై జీను వేశాడు.

24అతడు బయలుదేరి వెళ్లి పోతుంటే దారిలో ఒక సింహం అతనికి ఎదురుపడి అతన్ని చంపేసింది. అతని శవం దారిలోనే పడి ఉంది. గాడిద దాని దగ్గర నిలబడి ఉంది, సింహం కూడా శవం దగ్గర నిలబడి ఉంది.

25కొంతమంది అటుగా వెళ్తూ శవం దారిలో పడి ఉండడం, సింహం శవం దగ్గర నిలబడి ఉండడం చూసి, ఆ ముసలి ప్రవక్త నివసిస్తున్న ఊరు వచ్చి ఆ విషయం చెప్పారు.

26దారిలో నుండి అతన్ని తీసుకు వచ్చిన ఆ ప్రవక్త ఆ విషయం విని “యెహోవా మాట వినక ఎదురు తిరిగిన దైవ సేవకుడు ఇతడే. యెహోవా సింహానికి అతన్ని అప్పగించేసాడు. యెహోవా చెప్పినట్టు, అది అతన్ని చీల్చి చంపేసింది” అని చెప్పాడు.

27తన కొడుకులను పిలిచి “నా కోసం గాడిదను ప్రయాణానికి సిద్ధం చేయండి” అని చెప్పాడు. వారు అతని కోసం గాడిదను సిద్ధ పరిచారు.

28అతడు వెళ్లి అతని శవం దారిలో పడి ఉండడం, గాడిద, సింహం శవం దగ్గర నిలిచి ఉండడం, సింహం గాడిదను చీల్చివేయకుండా శవాన్ని తినకుండా ఉండడం చూసి

29ఆ ముసలి ప్రవక్త అ దేవుని మనిషి శవాన్ని ఎత్తి గాడిద మీద వేసుకుని దుఃఖించడానికీ శవాన్ని పాతి పెట్టడానికీ తన స్వగ్రామం వచ్చాడు.

30అతడు తన సొంత సమాధిలో ఆ శవాన్ని పాతిపెట్టాడు. ప్రజలు “అయ్యో! నా సోదరా” అంటూ ఏడ్చారు.

31అతన్ని పాతిపెట్టిన తరువాత, ఆ ముసలి ప్రవక్త తన కొడుకులతో “నేను చనిపోయినప్పుడు ఆ ప్రవక్తను ఉంచిన సమాధిలోనే నన్నూ పాతిపెట్టండి. నా ఎముకలను అతని ఎముకల దగ్గరే పెట్టండి.

32ఎందుకంటే యెహోవా మాటను బట్టి బేతేలులో ఉన్న బలిపీఠానికి వ్యతిరేకంగా, సమరయ పట్టణంలో ఉన్న ఉన్నత స్థలాల్లో ఉన్న మందిరాలన్నిటికీ వ్యతిరేకంగా అతడు ప్రకటించినది తప్పకుండా జరుగుతుంది” అని చెప్పాడు.

33ఇది జరిగిన తరువాత కూడా యరొబాము తన దుర్మార్గాన్ని విడిచిపెట్టలేదు. మరో సారి సాధారణ మనుషులను ఉన్నత పూజాస్థలాలకు యాజకులుగా నియమించాడు. పూజ చేయడానికి ఇష్టపడిన వారందరినీ యాజకులుగా ప్రతిష్ఠించి వారిని ఉన్నత పూజా స్థలాలకు యాజకులుగా నియమించాడు.

34యరొబాము వంశాన్ని నిర్మూలించి భూమి మీద లేకుండా చేయడానికి కారణమైన పాపం ఇదే.

← 1 Kings 12Read In The App, Free →1 Kings 14 →

Study 1 Kings 13

KJVMatthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)Reina-Valera (Español)Bíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)

All Chapters

12345678910111213141516171819202122