1 Peter · బైబిల్ (తెలుగు)

1 Peter 5

1తోటి పెద్దనూ, క్రీస్తు బాధలు చూసిన వాణ్ణి, ప్రత్యక్షం కాబోయే మహిమలో భాగస్వామినీ అయిన నేను మీలోని పెద్దలను హెచ్చరిస్తున్నాను.

2మీ దగ్గరున్న దేవుని మందను కాయండి. బలవంతంగా కాకుండా దేవుడు కోరే రీతిగా ఇష్ట పూర్వకంగా వారిని చూసుకోండి. చెడు లాభం ఆశించి కాకుండా ఇష్టంగా వారిని చూసుకోండి.

3మీ అజమాయిషీ కింద ఉన్న వారిపై పెత్తనం చేసేవారుగా ఉండక, మందకు ఆదర్శంగా ఉండండి.

4ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు, మీకు వాడిపోని మహిమ కిరీటం లభిస్తుంది.

5యువకులారా, మీరు పెద్దలకు లోబడి ఉండండి. మీరంతా ఒకరి పట్ల ఒకరు వినయం కలిగి ఉండండి. దేవుడు గర్విష్టులను ఎదిరించి వినయం గలవారికి కృప చూపుతాడు.

6అందుచేత, దేవుడు తగిన సమయంలో మిమ్మల్ని హెచ్చించేలా ఆయన బలిష్ఠమైన చేతి కింద మిమ్మల్ని మీరే తగ్గించుకోండి.

7ఆయన మీ గురించి శ్రద్ధ వహిస్తున్నాడు. కాబట్టి మీ ఆందోళన అంతా ఆయన మీద వేయండి.

8నిగ్రహంతో మెలకువగా ఉండండి. మీ శత్రువైన సాతాను, గర్జించే సింహంలా ఎవరిని కబళించాలా అని వెతుకుతూ తిరుగుతున్నాడు.

9వాణ్ణి ఎదిరించండి. మీ విశ్వాసంలో స్థిరంగా ఉండండి. లోకంలో ఉన్న మీ సోదరులకు కూడా ఇలాంటి బాధలే కలుగుతున్నాయి.

10తన నిత్య మహిమకు క్రీస్తులో మిమ్మల్ని పిలిచిన అపార కరుణానిధి అయిన దేవుడు కొంత కాలం మీరు బాధపడిన తరువాత, తానే మిమ్మల్ని సరైన స్థితిలోకి తెచ్చి, బలపరచి, సామర్థ్యం ఇచ్చి స్థిర పరుస్తాడు.

11ఆయనకే ప్రభావం శాశ్వతంగా కలుగు గాక. ఆమేన్‌.

12సిల్వాను నా నమ్మకమైన సోదరుడని ఎంచి, అతని సాయంతో క్లుప్తంగా రాశాను. నేను రాసిందే దేవుని సత్యమైన కృప అని సాక్ష్యం చెబుతూ, మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. దీనిలో నిలకడగా ఉండండి.

13బబులోను పట్టణంలో ఉన్న ఆమె (దేవుడు ఎన్నుకున్న ఆమె) మీకు అభినందనలు చెబుతున్నారు. నా కుమారుడు మార్కు మీకు అభినందనలు చెబుతున్నాడు.

14ప్రేమ ముద్దుతో ఒకరికొకరు అభినందనలు చెప్పుకోండి. క్రీస్తులో మీకందరికీ శాంతి కలుగు గాక.

← 1 Peter 4Read In The App, Free →2 Peter 1 →

Study 1 Peter 5

KJVMatthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeAlbert BarnesJohn WesleyJohn CalvinScofieldWilliam BurkittFamily Bible NotesGeneva Bible Notes (1599)Reina-Valera (Español)Bíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)

All Chapters

12345