Haggai · బైబిల్ (తెలుగు)

Haggai 2

1రాజైన దర్యావేషు పరిపాలనలో ఏడవ నెల ఇరవై ఒకటవ దినాన యెహోవా వాక్కు ప్రవక్త అయిన హగ్గయికి ప్రత్యక్షమై చెప్పినది ఏమిటంటే,

2“నీవు యూదాదేశపు అధికారి అయిన షయల్తీయేలు కుమారుడు జెరుబ్బాబెలుతోను ప్రధానయాజకుడైన యెహోజాదాకు కుమారుడు యెహోషువతోను శేషించిన జనులతోను ఇలా చెప్పు.

3పూర్వకాలంలో ఈ మందిరానికి ఉన్న మహిమను చూసినవారు మీలో ఉన్నారు గదా. అలాటి వారికి ఇది ఎలా కనబడుతున్నది? దానితో ఇది ఏ విధంగానూ సరి పోలినది కాదని తోస్తున్నది గదా.

4అయినా యెహోవా ఇచ్చే ఆజ్ఞ. జెరుబ్బాబెలూ, ధైర్యం తెచ్చుకో. ప్రధానయాజకుడు, యెహోజాదాకు కొడుకు యెహోషువా, ధైర్యం తెచ్చుకో. దేశంలో ఉన్న ప్రజలారా, ధైర్యం తెచ్చుకుని పని జరిగించండి. నేను మీకు తోడుగా ఉన్నాను. ఇదే సేనల ప్రభువైన యెహోవా వాక్కు.

5మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకోండి. నా ఆత్మ మీతో ఉంది కాబట్టి భయపడవద్దు.

6సేనల ప్రభువైన యెహోవా చెప్పేదేమిటంటే ఇక త్వరలోనే, ఇంకొకమారు ఆకాశాన్ని, భూమిని, సముద్రాన్ని, నేలను నేను కంపింపజేస్తాను.

7ప్రతి రాజ్యాన్నీ నేను కదిలించగా అన్యజనులందరి విలువైన వస్తువులు తీసుకు వస్తారు. నేను ఈ మందిరాన్ని మహిమతో నింపుతాను.” ఇదే సేనల ప్రభువైన యెహోవా వాక్కు.

8“వెండి నాది. బంగారం నాది” ఇదే సేనల ప్రభువు యెహోవా వాక్కు.

9ఈ చివరి మందిరం మహిమ మునుపటి మందిరం మహిమను మించి పోతుందని సేనల ప్రభువైన యెహోవా సెలవిస్తున్నాడు. ఈ స్థలంలో నేను శాంతిసమాధానాలు నిలుపుతాను. ఇదే సేనల ప్రభువు యెహోవా వాక్కు. 1 పవిత్రత, అపవిత్రత

10దర్యావేషు పరిపాలనలో రెండవ సంవత్సరం తొమ్మిదవ నెల ఇరవై నాలుగవ దినాన యెహోవా వాక్కు ప్రవక్త అయిన హగ్గయికి ప్రత్యక్షమై చెప్పినది ఏమిటంటే,

11సేనల ప్రభువైన యెహోవా ఇలా ఆజ్ఞ ఇస్తున్నాడు. యాజకుల దగ్గర ధర్మశాస్త్ర విచారణ చెయ్యి.

12“ఒకడు ప్రతిష్టితమైన మాంసాన్ని తన వస్త్రపు చెంగున కట్టుకుని, తన చెంగుతో రొట్టెనైనా వంటకాన్నైనా, ద్రాక్షారసాన్నైనా, నూనెనైనా మరి ఏ విధమైన భోజన పదార్థాన్నైనా, ముట్టుకుంటే ఆ ముట్టుకున్నది ప్రతిష్ఠితమవుతుందా?” అని యాజకులను అడిగితే, వారు “కాదు” అన్నారు.

13“శవాన్ని ముట్టుకోవడం వల్ల ఒకడు అంటుపడి అలాటి వాటిలో దేనినైనా ముట్టుకుంటే, అతడు ముట్టుకున్నది అపవిత్రం అవుతుందా?” అని హగ్గయి మళ్లీ అడిగినప్పుడు యాజకులు “అది అపవిత్రం అవుతుంది” అన్నారు.

14అప్పుడు హగ్గయి వారికి ఈ విధంగా జవాబిచ్చాడు. ఈ ప్రజలు కూడా నా దృష్టికి అలానే ఉన్నారు. వారు చేసే క్రియలన్నీ వారక్కడ అర్పించినవన్నీ నా దృష్టికి అపవిత్రం. ఇదే యెహోవా వాక్కు.

15ఈ రాతి మీద రాయి ఉంచి యెహోవా మందిరం కట్టనారంభించింది మొదలు ఆ వెనుక మీకు సంభవించినదాన్ని ఆలోచన చేసుకోండి.

16అప్పటి నుండి ఒకడు ఇరవై కుప్పల + 2:16 ఇరవై కుప్పల 200 కిల్లోలు కంకులు వేయగా పది కుప్పలంత + 2:16 పది కుప్పలంత 100 కిల్లోలు ధాన్యమే తేలుతున్నది. ఏభై కొలల తొట్టి దగ్గరికి ఒకడు రాగా ఇరవై కొలలు మాత్రమే దొరకుతున్నది.

17తెగులుతోను, కాటుకతోను, వడగండ్లతోను, మీ కష్టార్జితమంతటిని నేను నాశనం చేశాను. అయినా మీలో ఒక్కడు కూడా తిరిగి నా దగ్గరికి రాలేదు. ఇదే యెహోవా వాక్కు.

18మీరు ఆలోచించుకోండి. ఇంతకు ముందు తొమ్మిదవ నెల ఇరవై నాలుగవ దినం నుండి, అంటే యెహోవా మందిరపు పునాది వేసిన నాట నుండి మీకు సంభవించిన దాన్ని ఆలోచించుకోండి.

19కొట్లలో ధాన్యం ఉందా? ద్రాక్ష చెట్లు అయినా అంజూరపు చెట్లు అయినా దానిమ్మ చెట్లయినా ఒలీవ చెట్లు అయినా ఫలించాయా? అయితే ఇది మొదలు నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. 1 యెహోవా ఎన్నుకొన్న జెరుబ్బాబెలు

20రెండవ సారి ఆ నెల ఇరవై నాలుగవ దినాన యెహోవా వాక్కు హగ్గయికి మళ్ళీ ప్రత్యక్షమై ఇలా చెప్పాడు.

21“యూదాదేశపు అధికారి అయిన జెరుబ్బాబెలుతో ఇలా చెప్పు. ఆకాశాన్ని, భూమిని నేను కంపింపజేయ బోతున్నాను.

22రాజ్యాల సింహాసనాలను నేను కింద పడదోస్తాను. అన్యజనుల రాజ్యాలకున్న బలాన్ని నాశనం చేస్తాను. రథాలను, వాటిని ఎక్కిన వారిని కింద పడేస్తాను. గుర్రాలు రౌతులు ఒకరి ఖడ్గం చేత ఒకరు కూలి పోతారు.

23నా సేవకుడవు, షయల్తీయేలు కుమారుడవు అయిన జెరుబ్బాబెలూ, నేను నిన్ను ఏర్పరచుకున్నాను. కాబట్టి ఆ రోజున నేను నిన్ను ముద్ర ఉంగరంగా చేస్తాను. ఇదే సేనల ప్రభువు యెహోవా వాక్కు.”

← Haggai 1Read In The App, Free →Zechariah 1 →

Study Haggai 2

KJVMatthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)Reina-Valera (Español)Bíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)

All Chapters

12