Mark · బైబిల్ (తెలుగు)

Mark 6

1యేసు అక్కడ నుండి తన శిష్యులతో కలసి తన స్వగ్రామానికి వచ్చాడు

2విశ్రాంతి దినాన సమాజ మందిరంలో ఉపదేశించడం మొదలు పెట్టాడు. చాలామంది ఆయన ఉపదేశం విని ఎంతో ఆశ్చర్యపడ్డారు. “ఈ సంగతులన్నీ ఇతనికెలా తెలుసు? దేవుడు ఇతనికి ఎంతటి జ్ఞానం ఇచ్చాడు! ఇతని చేతుల ద్వారా ఇన్ని మహత్కార్యాలు ఎలా జరుగుతున్నాయి?

3ఇతడు వడ్రంగి కదూ! మరియ కొడుకు కదూ! యాకోబు, యోసే, యూదా, సీమోనులకు ఇతడు అన్న కదూ! ఇతడి చెల్లెళ్ళు అందరూ ఇక్కడ మనతోనే ఉన్నారు కదా!” అని చెప్పుకుంటూ ఆయన విషయంలో చాలా అభ్యంతరపడ్డారు.

4యేసు వారితో, “ప్రవక్తకు తన సొంత ఊరిలో, సొంత వారి మధ్య, సొంత ఇంట్లో తప్ప అన్ని చోట్లా గౌరవం లభిస్తుంది” అని అన్నాడు.

5అక్కడ యేసు కొద్దిమంది రోగుల మీద తన చేతులుంచి వారిని బాగుచేయడం తప్ప ఏ మహత్కార్యాలూ చేయలేకపోయాడు.

6వారి అపనమ్మకానికి ఆయన ఆశ్చర్యపడ్డాడు. ఆ తరువాత యేసు చుట్టుపక్కల గ్రామాలు తిరుగుతూ ఉపదేశం చేశాడు. 1 యేసు పన్నెండు మందిని పంపించడం మత్తయి 10:1-42; లూకా 9:1-6

7యేసు తన పన్నెండుమంది శిష్యులను దగ్గరికి పిలుచుకుని, వారికి దయ్యాల మీద అధికారమిచ్చి ఇద్దరిద్దరిగా పంపుతూ ఇలా ఆజ్ఞ ఇచ్చాడు.

8“ప్రయాణం కోసం చేతికర్ర తప్ప ఇంకేదీ తీసుకు వెళ్ళకండి. ఆహారం గాని, చేతి సంచిగాని, నడికట్టులో డబ్బుగాని, తీసుకు వెళ్ళకండి.

9చెప్పులు వేసుకోండి గాని, మారు దుస్తులు తీసుకు వెళ్ళకండి.

10ఒకరి ఇంటికి వెళ్ళాక ఆ గ్రామం విడిచే వరకూ ఆ ఇంట్లోనే ఉండండి.

11ఏ గ్రామం వారైనా మిమ్మల్ని స్వీకరించకపోతే, మీ మాటలు వినకపోతే, మీరు ఆ గ్రామం వదిలే ముందు వారి వ్యతిరేక సాక్షంగా మీ పాద ధూళిని దులిపి వేయండి.”

12శిష్యులు వెళ్ళి ‘పశ్చాత్తాప పడండి’ అంటూ ప్రకటించారు.

13ఎన్నో దయ్యాలను వదిలించారు. శిష్యులు అనేకమంది రోగులను నూనె రాసి బాగుచేశారు. 1 హేరోదు ఇబ్బంది, యోహాను వధ మత్తయి 14:1-14; లూకా 9:7-9

14యేసు పేరు ప్రసిద్ధి కావడం వల్ల ఆ సంగతి హేరోదు రాజుకు తెలిసింది. బాప్తిసం ఇచ్చే యోహాను బతికి వచ్చాడని, అందుకే యేసులో మహత్కార్యాలు చేసే శక్తి ఉన్నదని కొందరు అన్నారు.

15ఇతరులు, “ఈయన ఏలీయా” అన్నారు. ఇంకొందరు, “పూర్వకాలపు ప్రవక్తల వంటి ప్రవక్త” అన్నారు.

16కాని, హేరోదైతే, “నేను తల నరికించిన యోహాను మళ్ళీ బతికి వచ్చాడు” అన్నాడు.

17ఇంతకు ముందు హేరోదు స్వయంగా యోహానును బంధించి, ఖైదులో వేయించాడు. తాను వివాహం చేసుకున్న హేరోదియ కారణంగా అతడు ఈ పని చేయవలసి వచ్చింది. ఈమె హేరోదు సోదరుడైన ఫిలిప్పు భార్య.

18ఎందుకంటే యోహాను హేరోదుతో, “నీ సోదరుని భార్యను తెచ్చుకోవడం అన్యాయం” అని హెచ్చరించాడు.

19అందుచేత హేరోదియ యోహాను మీద పగపట్టి, అతణ్ణి చంపాలని ఆశించింది కానీ అలా చెయ్యలేకపోయింది.

20ఎందుకంటే హేరోదు యోహానుకు భయపడేవాడు. యోహాను నీతిమంతుడు, పవిత్రమైనవాడు అని హేరోదుకు తెలుసు కనుక అతణ్ణి కాపాడుతూ వచ్చాడు. హేరోదు యోహాను మాటలు విన్నప్పుడు ఎంతో కలవర పడేవాడు. అయినా అతని మాటలు వినడానికి ఇష్టపడేవాడు.

21ఒక రోజు హేరోదియకు అవకాశం దొరికింది. హేరోదు తన రాజ్యంలోని అధికారులను, సైన్యాధిపతులను, గలిలయలోని గొప్పవారిని పిలిచి తన పుట్టిన రోజు విందు చేశాడు.

22హేరోదియ కూతురు వచ్చి నాట్యం చేసి, హేరోదును అతని అతిధులను మెప్పించింది. అప్పుడు హేరోదు ఆమెతో, “నీకు ఏది ఇష్టమో అది అడుగు, ఇస్తాను!” అని అన్నాడు.

23“నువ్వు ఏది అడిగినా ఇస్తాను, నా రాజ్యంలో సగమైనా సరే!” అని ప్రమాణం చేశాడు.

24ఆమె బయటకి వెళ్ళి తన తల్లితో, “నన్నేమి కోరుకోమంటావు?” అని అడిగింది. ఆమె, “బాప్తిసం ఇచ్చే యోహాను తల కోరుకో” అని చెప్పింది.

25వెంటనే ఆమె రాజు దగ్గరికి త్వరగా వెళ్ళి, “బాప్తిసం ఇచ్చే యోహాను తలను పళ్ళెంలో పెట్టి ఇప్పుడే నాకు ఇప్పించండి, నాకు కావలసింది అదే” అని అడిగింది.

26రాజుకు చాలా దుఃఖం కలిగింది గాని, తాను చేసిన ప్రమాణం కారణంగా తనతో కూర్చుని ఉన్నవారిని బట్టి ఆమె కోరికను తోసిపుచ్చలేక పోయాడు.

27అందువల్ల అతడు వెంటనే యోహాను తల తీసుకు రమ్మని ఆజ్ఞాపించి భటుణ్ణి పంపాడు. ఆ భటుడు వెళ్ళి ఖైదులోనే యోహాను తల నరికి

28దాన్ని ఒక పళ్ళెంలో పెట్టి, తీసుకు వచ్చి ఆమెకు కానుకగా ఇచ్చాడు. ఆమె దాన్ని తన తల్లికి ఇచ్చింది.

29యోహాను శిష్యులు ఈ సంగతి విని వచ్చి అతని శవాన్ని తీసుకుపోయి సమాధి చేశారు. 1 ప్రచార పర్యటన నుండి అపొస్తలుల తిరిగి రాక లూకా 9:10

30అపొస్తలులు యేసు దగ్గరికి తిరిగి వచ్చి తాము చేసిన వాటి గురించీ బోధించిన వాటి గురించీ వివరంగా ఆయనకు చెప్పారు. 1 ఐదు వేలమందికి ఆహారం మత్తయి 14:1-2; లూకా 9:10-17; యోహా 6:5-13

31వారి దగ్గరికి అనేకమంది వస్తూ పోతూ ఉండడం వల్ల వారికి భోజనం తినడానికి కూడా సమయం లేకపోయింది. యేసు వారితో, “నాతో మీరు మాత్రమే ఒక నిర్జన ప్రదేశానికి వచ్చి, కొంత విశ్రాంతి తీసుకోండి” అని అన్నాడు.

32అందువల్ల వారు మాత్రమే పడవలో ఏకాంతంగా నిర్జన ప్రదేశానికి వెళ్ళారు.

33అయితే వారు వెళ్తూ ఉండగా జనసమూహాలు ఆయనను గుర్తుపట్టి వివిధ గ్రామాల నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళి వారికన్నా ముందే ఆ నిర్జన ప్రదేశానికి చేరుకున్నారు.

34పడవలో యేసు అక్కడికి చేరినప్పుడు పెద్ద జనసమూహం ఆయనకు కనిపించింది. కాపరి లేని గొర్రెల్లా ఉన్న ఆ ప్రజలను చూసి ఆయనకు జాలి కలిగింది. అందుచేత ఆయన వారికి అనేక విషయాలు ఉపదేశించ సాగాడు.

35చాలా పొద్దుపోయిన తరువాత ఆయన శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి, “ఇది నిర్జన ప్రదేశం, ఇప్పటికే పొద్దుపోయింది.

36ఈ ప్రజలకు తినడానికి ఏమీ లేదు కాబట్టి వారు చుట్టూ ఉన్న పల్లెలకో గ్రామాలకో వెళ్ళి ఏదైనా కొనుక్కోడానికి వారిని పంపివెయ్యి” అన్నారు.

37అయితే యేసు వారితో, “మీరే వారికి ఆహారం పెట్టండి!” అన్నాడు. అందుకు వారు ఆయనతో, “రెండు వందల దేనారాలకు రొట్టెలు కొని, వారికి పంచి పెట్టమంటావా” అని ఆయనను అడిగారు.

38ఆయన వారితో “మీ దగ్గర ఎన్ని రొట్టెలు ఉన్నాయో చూడండి” అన్నాడు. వారు వెళ్ళి చూసి, “ఐదు రొట్టెలు, రెండు చిన్న చేపలు ఉన్నాయి” అని అన్నారు.

39అప్పుడాయన అందరినీ గుంపులు గుంపులుగా పచ్చగడ్డి మీద కూర్చోబెట్టమని శిష్యులతో చెప్పాడు.

40ప్రజలు గుంపుకు యాభైమంది, వందమంది చొప్పున కూర్చున్నారు.

41యేసు ఆ ఐదు రొట్టెలు, రెండు చేపలు చేతపట్టుకుని ఆకాశం వైపు చూసి, దేవునికి కృతజ్ఞత చెప్పి రొట్టెలు విరిచి, జనసమూహానికి వడ్డించడానికి శిష్యులకు అందించాడు. అదే విధంగా ఆ రెండు చేపలను కూడా భాగాలు చేసి అందరికీ పంచాడు.

42అందరూ తిని సంతృప్తి చెందారు.

43శిష్యులు మిగిలిన రొట్టె ముక్కలను, చేప ముక్కలను పన్నెండు గంపల నిండా నింపారు.

44ఆ రోజు అక్కడ రొట్టెలు తిన్న పురుషులు ఐదు వేల మంది. 1 యేసు నీటి పై నడక మత్తయి 14:22-32; యోహా 6:15-21

45ఆ తరువాత యేసు తన శిష్యులను తనకన్నా ముందు బేత్సయిదాకు వెళ్ళమని చెప్పి వారిని పడవ ఎక్కించాడు.

46జనసమూహాన్ని పంపివేసిన తరువాత ఆయన ప్రార్థించడానికి కొండకు వెళ్ళాడు.

47చీకటి పడుతూ ఉన్న సమయంలో శిష్యులు ఉన్న పడవ సముద్రం మధ్యలో ఉంది. యేసు మాత్రమే ఒడ్డున ఉన్నాడు.

48ఎదురుగాలి వీస్తూ ఉండడం వల్ల శిష్యులు చాలా కష్టంగా పడవ నడపడం చూసి యేసు తెల్లవారుజామున సరస్సు మీద నడుస్తూ వారి దగ్గరికి వెళ్ళాడు. ఆయన వారిని దాటి వెళ్ళబోతూ ఉండగా,

49ఆయన శిష్యులు ఆయన నీళ్ళ మీద నడవడం చూసి, దయ్యం అనుకుని భయపడి బిగ్గరగా కేకలు వేశారు.

50వెంటనే యేసు వారితో, “ధైర్యంగా ఉండండి. నేనే! భయపడకండి!” అని అన్నాడు.

51ఆయన వారి దగ్గరికి వచ్చి, పడవ ఎక్కగానే గాలి ఆగింది. వారు తమలో తాము ఆశ్చర్యపడుతూ అమితంగా విభ్రాంతి చెందారు.

52ఎందుకంటే రొట్టెలు పంచిన అద్భుతాన్ని వారు చూశారు కాని, వారి హృదయం బండబారి పోయింది కాబట్టి రొట్టెలను గురించిన సంగతి వారు గ్రహించలేదు. 1 గెన్నేసరెతు తీరాన స్వస్థతలు మత్తయి 14:34-36

53వారు అవతలి ఒడ్డుకు వెళ్ళి గెన్నేసరెతు ప్రాంతానికి చేరి అక్కడ పడవ నిలిపారు.

54వారు పడవ దిగిన వెంటనే ప్రజలు యేసును గుర్తుపట్టారు.

55ప్రజలు చుట్టు పక్కల ఉన్న ప్రాంతాలకు పరుగెత్తుకుంటూ వెళ్ళి రోగులను మంచాల మీద ఉంచి ఆయన ఉన్న చోటికి తీసుకు వచ్చారు.

56యేసు ఏ గ్రామంలో, ఏ పట్టణంలో ఏ పల్లెలో ప్రవేశించినా వారు రోగులను వీధుల్లో పడుకోబెట్టి, ఆయన వస్త్రాన్నయినా తాకనియ్యమని ఆయనను బతిమాలారు. ఆయనను తాకిన వారంతా బాగుపడ్డారు.

← Mark 5Read In The App, Free →Mark 7 →

Study Mark 6

KJVMatthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeAlbert BarnesJohn WesleyJohn CalvinScofieldWilliam BurkittFamily Bible NotesThe Fourfold GospelJohn LightfootGeneva Bible Notes (1599)Reina-Valera (Español)Bíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)

All Chapters

12345678910111213141516