Proverbs · బైబిల్ (తెలుగు)

Proverbs 5

1కుమారా, నేను బోధించే జ్ఞానవాక్కులు విను. నా తెలివి గల మాటలు శ్రద్ధగా ఆలకించు.

2అప్పుడు నువ్వు జ్ఞానయుక్తంగా నడుచుకుంటావు. నీ తెలివితేటలను బట్టి నీ నోరు మాట్లాడుతుంది.

3వ్యభిచారిణి పెదవుల నుండి తేనెలాంటి మాటలు వెలువడతాయి. దాని నోటి మాటలు నూనె కంటే మృదువుగా ఉంటాయి.

4చివరికి ఆమె వసనాభి కాయలాగా ఉంటుంది. రెండంచుల కత్తి వలే ఉంటుంది.

5దాని ప్రవర్తన మరణంలో పడిపోవడానికి దారితీస్తుంది. దాని మార్గం సూటిగా పాతాళానికి చేరుస్తుంది.

6జీవమార్గం గురించి వ్యభిచారిణి ఎంతమాత్రం ఆలోచించదు. ఆమె ఎటు వెళ్తుందో ఆమెకే తెలియక అటూ ఇటూ సంచరిస్తుంది.

7కుమారులారా, నేను చెప్పే బోధ ఆలకించండి. నేను చెప్పే ఉపదేశం నుండి పక్కకు మళ్ళుకోవద్దు.

8వ్యభిచారిణి నివసించే స్థలాల నుండి నీ అడుగులు దూరం చేసుకో. ఆమె యింటి వాకిలి వైపు పోవద్దు.

9నువ్వు గనుక వ్యభిచారిణి దగ్గరికి వెళ్లిన పక్షంలో నీ ప్రతిష్ట నవ్వుల పాలౌతుంది. నీ జీవిత కాలమంతా దుష్టుల చేతిల్లోకి వెళ్తుంది.

10అన్యులు నీ ఆస్తిని అనుభవిస్తారు. నీ కష్టార్జితమంతా పరుల ఇల్లు చేరుతుంది.

11చివరికి నీ కండరాలు, నీ శరీరం క్షీణించిపోతాయి.

12అప్పుడు నువ్వు, అయ్యో, ఉపదేశాన్ని నేనెందుకు లక్ష్యపెట్టలేదు? నా మనస్సాక్షి గద్దింపును ఎందుకు తిరస్కరించాను?

13నా బోధకులు చెప్పిన మంచి మాటలు వినలేకపోయాను. నా గురువుల ఉపదేశాలను పట్టించుకోలేదు.

14సమాజంలో నేను అన్ని రకాల కీడులకు దగ్గరగా వచ్చాను, అని నీకు నువ్వు చెప్పుకుంటూ మధనపడతావు.

15నీ ఇంటి బావిలో ఉబుకుతున్న నీళ్ళు, నీ సొంత కుండలోని నీళ్లు తాగు.

16నీ ఇంట ఉబికే నీటి ఊటలు బయటికి పారవచ్చా? అవి కాలువల్లాగా వీధుల్లో ప్రవహించవచ్చా?

17పరాయి వ్యక్తులు నీతోబాటు వాటిని అనుభవించకూడదు. ఆ నీరు నీ కోసమే ఉండాలి గదా.

18నీ జలాశయం దీవెనలు పొందుతుంది. నీ యవ్వన కాలంలో పెళ్ళాడిన నీ భార్యతో సంతోషించు.

19ఆమె నీకు రమణీయమైన లేడి వంటిది. అందమైన దుప్పిలాంటిది. ఆమె రొమ్ములు నీకు ఎల్లప్పుడూ తృప్తి కలిగించనియ్యి. ఆమె ప్రేమకు బద్ధుడివై చిరకాలం జీవించు.

20కుమారా, నువ్వు ఎందుకు వ్యభిచారిణి వలలో పడిపోయి ఉంటావు? ఆమె రొమ్మును ఎందుకు కౌగలించుకుంటావు?

21మనుషుల ప్రవర్తన యెహోవాకు తెలుసు. వారి నడతలన్నిటినీ ఆయన గుర్తిస్తాడు.

22దుష్టుడు చేసే పనులు వాణ్ణి ఇరకాటంలో పడవేస్తాయి. వాడు తన పాప కార్యాల వల్ల శిక్షకు గురౌతాడు.

23అలాంటివాడు క్రమశిక్షణ లేకపోవడం వల్ల పరమ మూర్ఖుడై దారి తప్పి నాశనానికి గురౌతాడు.

← Proverbs 4Read In The App, Free →Proverbs 6 →

Study Proverbs 5

KJVMatthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)Reina-Valera (Español)Bíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)

All Chapters

12345678910111213141516171819202122232425262728293031