1 Samuel · బైబిల్ (తెలుగు)

1 Samuel 5

1ఫిలిష్తీయులు దేవుని మందసాన్ని పట్టుకుని ఎబెనెజరు నుండి అష్డోదుకు తీసుకువచ్చారు.

2వారు దాగోను గుడిలో దాగోను విగ్రహం ముందు దాన్ని ఉంచారు.

3అయితే మరుసటి రోజు అష్డోదు ప్రజలు ఉదయాన్నే లేచి చూసినప్పుడు యెహోవా మందసం ముందు దాగోను విగ్రహం నేలపై బోర్లా పడి ఉంది. వారు దాగోనును పైకి లేపి దాని స్థానంలో తిరిగి నిలబెట్టారు.

4ఆ తరువాతి రోజు ఉదయం కూడా దాగోను యెహోవా మందసం ఎదురుగా నేలపై బోర్లా పడి ఉంది. దాగోను విగ్రహం తల, రెండు అరచేతులు నరికివేసి గుమ్మం దగ్గర పడి ఉన్నాయి. దాని మొండెం మాత్రం దానికి మిగిలి ఉంది.

5అందువల్ల ఈ రోజు వరకూ దాగోను యాజకులుగాని, గుడికి వచ్చేవారు గానీ, ఎవరూ అష్డోదులో దాగోను గుడి గడప తొక్కరు.

6యెహోవా హస్తం అష్డోదు వారిపై బహు భారంగా ఉంది. అష్డోదులో, దాని సరిహద్దుల్లో ఉన్నవారికి ఆయన తీవ్రమైన గడ్డలు రప్పించి వారిని చంపివేశాడు.

7అష్డోదు ప్రజలు జరిగింది చూసి “ఇశ్రాయేలీయుల దేవుని మందసం మన మధ్య ఉండ కూడదు. ఎందుకంటే ఆయన హస్తం మనమీదా, మన దేవుడు దాగోను మీదా తీవ్రంగా ఉంది.” అని చెప్పుకున్నారు.

8కాబట్టి వారు ఫిలిష్తీయుల నాయకులందరినీ పిలిపించి “ఇశ్రాయేలీయుల దేవుని మందసాన్ని మనం ఏమి చేద్దాం?” అని అడిగారు. అందుకు పెద్దలు “ఇశ్రాయేలీయుల దేవుని మందసాన్ని ఇక్కడనుండి గాతు పట్టణానికి పంపించండి” అని చెప్పారు. అప్పుడు వారు ఇశ్రాయేలీయుల దేవుని మందసాన్ని అక్కడనుండి గాతుకు తీసుకు వెళ్లారు.

9వారు అష్డోదు నుండి గాతుకు దాన్ని మోసుకు పోయిన తరువాత యెహోవా హస్తం గాతులో పెద్ద కలవరం పుట్టించింది. ఆయన పెద్దలకు, పిల్లలకు వినాశం కలిగించాడు. వారి దేహాలపై గడ్డలు వచ్చాయి.

10వెంటనే వారు దేవుని మందసాన్ని ఎక్రోనుకు పంపివేశారు. దేవుని మందసం ఎక్రోనులోకి వచ్చినప్పుడు ఎక్రోనీయులు కేకలు వేసి “మనలనూ మన ప్రజలనూ చంపివేయాలని వీరు ఇశ్రాయేలీయుల దేవుని మందసాన్ని మన దగ్గరికి తీసుకువచ్చారు” అన్నారు.

11అప్పుడు ప్రజలు ఫిలిష్తీయుల పెద్దలను పిలిపించి “ఇశ్రాయేలీయుల దేవుని మందసం మనలను మన ప్రజలను చంపకుండా ఉండేలా దాన్ని దాని స్వస్థలానికి పంపించండి” అని చెప్పారు. దేవుని హస్తం శిక్ష అక్కడ ఎంతో భారంగా ఉంది. అందువల్ల మరణ భయం ఆ పట్టణం వారందరినీ అల్లకల్లోలం చేసింది.

12చనిపోకుండా మిగిలినవారు గడ్డలతో తీవ్రంగా బాధపడ్డారు. ఆ ఊరి ప్రజల అరుపులు ఆకాశాన్ని అంటాయి.

← 1 Samuel 4Read In The App, Free →1 Samuel 6 →

Study 1 Samuel 5

KJVMatthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)Reina-Valera (Español)Bíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)

All Chapters

12345678910111213141516171819202122232425262728293031