1 Samuel · బైబిల్ (తెలుగు)

1 Samuel 9

1బెన్యామీను గోత్రానికి చెందిన కీషు అనే ధనవంతుడు ఉండేవాడు. కీషు తండ్రి అబీయేలు. అబీయేలు తండ్రి సేరోరు. సేరోరు తండ్రి బెకోరతు. బెకోరతు తండ్రి అఫీయా.

2కీషుకు సౌలు అనే ఒక కొడుకు ఉన్నాడు. అతడు చాలా అందమైన యువకుడు. ఇశ్రాయేలీయుల్లో అతణ్ణి మించిన అందగాడు లేడు. అతడు భుజాలపై నుండి ఇతరుల కంటే ఎత్తయినవాడు.

3సౌలు తండ్రి కీషుకు చెందిన గాడిదలు తప్పిపోయినపుడు కీషు తన కొడుకు సౌలును పిలిచి “మన పనివాళ్ళలో ఒకణ్ణి వెంటబెట్టుకుని వెళ్ళి గాడిదలను వెదుకు” అని చెప్పాడు.

4అతడు వెళ్ళి ఎఫ్రాయిము కొండలన్నీ తిరిగి షాలిషా దేశంలో వెతికినా అవి కనబడలేదు. తరువాత వారు షయలీము దేశం దాటి తిరిగినప్పటికీ అవి కనబడలేదు. బెన్యామీనీయుల దేశంలో వెతికినప్పటికీ అవి కనబడలేదు.

5అప్పుడు వారు సూపు దేశానికి వచ్చినప్పుడు “మనం వెనక్కు వెళ్ళిపోదాం, గాడిదలను గూర్చి బాధపడ వద్దు. మా నాన్న మనకోసం ఎదురు చూస్తుంటాడు” అని సౌలు తనతో ఉన్న పనివాడితో అన్నప్పుడు,

6వాడు “ఈ ఊర్లో దేవుని మనిషి ఒకడు ఉన్నాడు, అతడు చాలా గొప్పవాడు, అతడు ఏది చెపితే అది జరుగుతుంది. మనం ఎటు వెళ్ళాలో ఆ దారి అతడు మనకు చెబుతాడేమో, అతని దగ్గరకి వెళ్ళి అడుగుదాం రండి” అని చెప్పాడు.

7అప్పుడు సౌలు “మనం వెళ్లేటప్పుడు అతనికి ఏమి తీసుకు వెళ్ళాలి? మన దగ్గర ఉన్న భోజన పదార్దాలు అన్నీ అయిపోయాయి. ఆ దేవుని మనిషికి బహుమానంగా ఇవ్వడానికి మన దగ్గర ఏమీ లేదు కదా! మన దగ్గర ఏం ఉన్నాయి?” అని తన పనివాణ్ణి అడిగాడు.

8వాడు సౌలుతో “అయ్యా, వినండి. నా దగ్గర పావు తులం + 9:8 పావు తులం 3 గ్రాములు చిన్న నాణెంవెండి ఉంది, మనకు దారి చెప్పినందుకు దాన్ని ఆ దైవజనునికి ఇస్తాను” అన్నాడు.

9ఇప్పుడు ప్రవక్తగా ఉన్నవాడిని గతంలో దీర్ఘదర్శి అని పిలిచేవాడు. ఇదివరకూ ఇశ్రాయేలీయులు ఎవరైనా దేవుని నుండి ఏదైనా విషయం తెలుసుకోవాలని ఆశించి వెళ్లే సమయంలో “మనం దీర్ఘదర్శి దగ్గరకి వెళ్దాం పదండి” అని చెప్పుకోవడం పరిపాటి.

10అప్పుడు సౌలు “నువ్వు చెప్పింది బాగుంది. వెళ్దాం పద” అన్నాడు.

11వారు దైవజనుడు ఉండే ఊరికి బయలుదేరారు. ఊరిలోకి వెళ్తుండగా నీళ్లు తోడుకోవడానికి వచ్చిన యువతులు వారికి ఎదురుపడినప్పుడు “ఇక్కడ దీర్ఘదర్శి ఉన్నాడా?” అని అడిగారు.

12అందుకు వారు “ఇదిగో అతడు ఈ దగ్గరలోనే ఉన్నాడు. తొందరగా వెళ్ళి కలుసుకోండి. ఈ రోజే అతడు ఊర్లోకి వచ్చాడు. ఈ రోజే ఉన్నత స్థలం లో ప్రజల పక్షంగా బలి అర్పిస్తాడు.

13మీరు ఊర్లోకి వెళ్ళగానే అతడు భోజనం చేయడానికి కొండ ప్రాంతానికి వెళ్లక ముందే మీరు అతణ్ణి కలుసుకోవచ్చు. అతడు వచ్చేంత వరకూ ప్రజలు భోజనం చేయరు, అతడు బలిని ఆశీర్వదించిన తరువాతే పిలిచిన వారు భోజనం చేస్తారు. మీరు త్వరగా వెళ్ళండి, అతణ్ణి కలుసుకోడానికి ఇదే సరైన సమయం.” అని చెప్పారు.

14వారు ఊళ్లోకి వెళ్ళగానే కొండ ప్రాంతానికి వెళ్తున్న సమూయేలు వారికి ఎదురయ్యాడు.

15సౌలు అక్కడకు రేపు వస్తాడని యెహోవా సమూయేలుకు చెప్పాడు.

16ఎందుకంటే “నా ప్రజల విన్నపం నాకు చేరింది. నేను వారిని పట్టించుకొంటున్నాను. కాబట్టి ఫిలిష్తీయుల చేతిలోనుండి నా ప్రజలను విడిపించడానికి నా ప్రజలైన ఇశ్రాయేలీయులపై అతణ్ణి రాజుగా అభిషేకించడానికి రేపు ఇదే సమయానికి నేను బెన్యామీను దేశంలో నుండి ఒక వ్యక్తిని నీ దగ్గరికి రప్పిస్తాను.”

17సౌలు సమూయేలుకు కనబడినప్పుడు, యెహోవా “ఇతడే నేను నీతో చెప్పిన వ్యక్తి. ఇతడే నా ప్రజలను పరిపాలిస్తాడు” అని అతనితో చెప్పాడు.

18సౌలు పురద్వారంలో సమూయేలును కలుసుకుని “దీర్ఘదర్శి ఉండేది ఎక్కడ? దయచేసి నాకు చూపించండి” అని అడిగినప్పుడు,

19సమూయేలు సౌలును చూసి “నేనే దీర్ఘదర్శిని. కొండ ప్రాంతానికి వెళ్ళండి, ఈరోజు మీరు నాతో కలసి భోజనం చెయ్యాలి. రేపు నీ సందేహం తీర్చి నేను నిన్ను పంపిస్తాను.

20మూడు రోజుల క్రితం తప్పిపోయిన నీ గాడిదలను గూర్చి విచారించవద్దు, అవి దొరికాయి. ఇశ్రాయేలీయుల ఇష్టం ఎవరి పైన ఉంది? నీపైనా, నీ తండ్రి సంతానం పైనే కదా” అన్నాడు.

21అప్పుడు సౌలు “నేను బెన్యామీను గోత్రానికి చెందినవాణ్ణి కదా. నా గోత్రం ఇశ్రాయేలీయుల గోత్రాల్లో అల్పమైనది కదా. నా కుటుంబం బెన్యామీను గోత్రపు వారందరిలో అల్పులు కదా? నాతో ఈ విధంగా ఎందుకు మాట్లాడుతున్నావు?” అన్నాడు.

22అయితే సమూయేలు సౌలును, అతని పనివాణ్ణి భోజనపు గదిలోకి వెంటబెట్టుకుని వెళ్ళి తాను పిలిచిన ముప్ఫై మంది ఉన్న మొదటి వరుసలో వారిని కూర్చోబెట్టి

23వంటవాణ్ణి చూసి “నేను ఉంచమని చెప్పి నీ చేతికి ఇచ్చిన దాన్ని తీసుకురా” అని చెప్పినప్పుడు,

24అ వంటవాడు తొడ ఎముకను, దానిపైన ఉన్న మాంసాన్ని తీసుకువచ్చి సౌలుకు వడ్డించాడు. సమూయేలు సౌలుతో ఇలా అన్నాడు. “చూడు, మనం కలుసుకొనే సమయం కోసం దాచిపెట్టిన దాన్ని నీకు వడ్డించాను. పిలిచిన వాళ్ళు వచ్చినప్పటినుంచి దీన్ని ఈ సందర్భానికి నీ కోసం ఉంచాలని నేను వంటవాడితో చెప్పాను” అన్నాడు. ఆ రోజు సౌలు సమూయేలుతో కలసి భోజనం చేశాడు.

25పట్టణ ప్రజలు కొండపై నుండి కిందికి దిగుతున్న సమయంలో సమూయేలు తన ఇంటిపై సౌలుతో మాట్లాడుతున్నాడు.

26తరువాతి రోజు తెల్లవారుజామున సమూయేలు “నేను నీకు వీడ్కోలు చెప్పడానికి మిద్దెమీదికి రా” అని సౌలును పిలవగా సౌలు లేచాడు. తరువాత వారిద్దరూ బయలుదేరి

27ఊరి చివరకూ వస్తుండగా సమూయేలు సౌలుతో “నీ పనివాణ్ణి మనకంటే ముందుగా వెళ్ళమని చెప్పు. దేవుడు నీతో చెప్పమన్నది నేను నీకు తెలియజేసేవరకూ నువ్వు ఇక్కడే ఆగిపో” అని చెప్పగా సౌలు పనివాణ్ణి ముందుగా పంపివేశాడు.

← 1 Samuel 8Read In The App, Free →1 Samuel 10 →

Study 1 Samuel 9

KJVMatthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)Reina-Valera (Español)Bíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)

All Chapters

12345678910111213141516171819202122232425262728293031