2 Kings · బైబిల్ (తెలుగు)

2 Kings 12

1యెహూ పరిపాలనలో ఏడవ సంవత్సరంలో యోవాషు తన పరిపాలన మొదలుపెట్టి యెరూషలేములో 40 సంవత్సరాలు పాలించాడు. అతని తల్లి బెయేర్షెబా ప్రాంతానికి చెందిన జిబ్యా.

2యోవాషుకు యాజకుడైన యెహోయాదా మార్గదర్శకుడుగా ఉన్నంత కాలం అతడు యెహోవా దృష్టిలో యోగ్యంగానే ప్రవర్తించాడు.

3అయితే పూజా స్థలాలను తీసివేయలేదు. ప్రజలు ఇంకా అలాటి చోట్ల బలులు అర్పిస్తూ ధూపం వేస్తూ వచ్చారు. 1 యోవాషు మందిరాన్ని బాగుచేయడం

4యోవాషు యాజకులతో ఇలా అన్నాడు. “యెహోవా మందిరంలోకి తెచ్చే ప్రతిష్ఠిత వస్తువుల వల్ల వచ్చే డబ్బును యెహోవా మందిరంలోకి తేవాలి. ప్రతి మనిషీ చెల్లించే పన్ను మొత్తాన్నీ, ప్రతి మనిషీ యెహోవా ప్రేరణ మూలంగా తన హృదయంలో నిర్ణయించుకుని ఆలయం పని కోసం చెల్లించిన డబ్బును తేవాలి.

5యాజకులు ప్రజలు కట్టిన ఆ పన్ను మొత్తాన్ని సేకరించాలి. మందిరం మరమ్మత్తు పని కోసం ఆ డబ్బు వినియోగిస్తూ, మందిరాన్ని మంచి స్థితిలో ఉంచాలి.”

6అయితే యోవాషు పరిపాలనలో 23 వ సంవత్సరం దాకా యాజకులు మందిరం మరమ్మత్తులను చేపట్టనే లేదు.

7అప్పుడు యోవాషు యాజకుడైన యెహోయాదాను, మిగిలిన యాజకులను పిలిపించి “మందిరంలో శిథిలమైన భాగాలను మీరెందుకు బాగు చేయలేదు? ఇకపై పన్ను చెల్లించే వారి దగ్గర డబ్బు తీసుకోకండి. మందిరం మరమ్మత్తుల కోసం ఇంత వరకూ సేకరించిన మొత్తాన్ని ఆ పని చేసే వారికే అప్పగించండి” అని ఆజ్ఞ ఇచ్చాడు.

8కాబట్టి యాజకులు మందిరం మరమ్మత్తు పనులు వారు చూడడం లేదు గనక ఇకపై ప్రజల దగ్గర డబ్బు తీసుకోవడం మానుకున్నారు.

9యాజకుడు యెహోయాదా ఒక పెట్టె తెచ్చి దాని మూతకు కన్నం పెట్టి, బలిపీఠం పక్కన అంటే ఆలయంలో ప్రవేశించే వారికి కుడి వైపుగా దాన్నిఉంచాడు. మందిరంలోకి ప్రజలు తెచ్చే డబ్బంతా ద్వారపాలకులైన యాజకులు అందులో వేశారు.

10పెట్టె నిండి పోయిన ప్రతిసారీ రాజు కార్యదర్శి, ప్రధాన యాజకుడు వచ్చి యెహోవా ఆలయంలోని డబ్బు లెక్క చూసి సంచుల్లో ఉంచారు.

11తరువాత వారు ఆ డబ్బును తూచి యెహోవా మందిరం వ్యవహారాలు చూసుకునే వారికి ఇచ్చారు. వారు యెహోవా మందిరం మరమ్మత్తు పని చేసే వడ్రంగులకు, కట్టే పనివారికి ఆ డబ్బు ఇచ్చారు.

12ఇంకా తాపీ పని వాళ్ళకి, రాళ్లు చెక్కే వారికీ యెహోవా మందిరం మరమ్మత్తుకై కలప, చెక్కిన రాళ్ళూ కొనడానికి ఇంకా మందిరం బాగు చేయడానికి అయ్యే ఖర్చు కోసం ఆ డబ్బు ఇస్తూ వచ్చారు.

13యెహోవా మందిరం కోసం వెండి పాత్రల కోసం గానీ, కత్తెరలు, గిన్నెలు, బాకాలు, బంగారు వెండి వస్తువులు మొదలైన వాటి కోసం గానీ ఆ డబ్బు వాడలేదు.

14కేవలం యెహోవా మందిరాన్ని మరమ్మతు పని చేసే వారికి మాత్రమే ఆ డబ్బు ఇచ్చారు.

15మరమ్మత్తుల కోసం ఆ డబ్బు తమ దగ్గర ఉంచి పనివారికి ఇస్తూ ఉండే వారు నమ్మకస్థులు గనక ఎవరూ వారిని లెక్క అడగలేదు.

16అపరాధ పరిహార బలుల మూలంగా పాప పరిహార బలుల మూలంగా జమ అయిన డబ్బు యెహోవా మందిరానికి ఉపయోగించాలి. ఎందుకంటే అది యాజకులది.

17అటు తరువాత సిరియా రాజు హజాయేలు గాతు పట్టణంపై దాడి చేసి దాన్ని వశపరచుకున్న తరువాత అతడు యెరూషలేము మీదికి రావాలని ఉన్నాడు.

18యూదా రాజు యోవాషు తన పూర్వీకులైన యెహోషాపాతు, యెహోరాము, అహజ్యా మొదలైన యూదా రాజులు యెహోవాకు ప్రతిష్ఠించిన పవిత్ర వస్తువులనూ తాను ప్రతిష్ఠించిన వస్తువులనూ, యెహోవా మందిరం గిడ్డంగుల్లో, రాజ భవనంలో కనిపించిన బంగారమంతా పోగు చేసి సిరియా రాజు హజాయేలుకు పంపాడు. అప్పుడు హజాయేలు యెరూషలేము నుండి వెళ్ళిపోయాడు.

19యోవాషు గురించిన మిగతా విషయాలు, అతని యితర కార్యాలను గూర్చి యూదా రాజుల వృత్తాంత గ్రంథంలో రాసి ఉన్నాయి కదా.

20అతని సేవకులు లేచి కుట్ర చేసి సిల్లాకు దిగి వెళ్ళే దారిలో మిల్లో అని పేరున్న అంతఃపురంలో యోవాషును చంపారు.

21షిమాతు కొడుకు యోజాకారు షోమేరు కొడుకు యెహోజాబాదు అనే అతని సేవకులు అతనిపై దాడి చేయగా అతడు మరణించాడు. ప్రజలు దావీదు పురంలో అతని పూర్వీకుల సమాధిలో అతణ్ణి పాతిపెట్టారు. అతని కుమారుడు అమజ్యా అతని స్థానంలో రాజయ్యాడు.

← 2 Kings 11Read In The App, Free →2 Kings 13 →

Study 2 Kings 12

KJVMatthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)Reina-Valera (Español)Bíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)

All Chapters

12345678910111213141516171819202122232425