2 Kings · బైబిల్ (తెలుగు)

2 Kings 14

1యెహోయాహాజు కొడుకు యెహోయాషు ఇశ్రాయేలుకు రాజుగా ఉన్న రెండో సంవత్సరంలో యోవాషు కొడుకు అమజ్యా యూదాకు రాజయ్యాడు.

2అతడు రాజైనప్పుడు అతని వయస్సు 25 సంవత్సరాలు. అతడు యెరూషలేములో 29 సంవత్సరాలు రాజుగా ఉన్నాడు. అతని తల్లి యెరూషలేము నివాసి యెహోయద్దాను.

3ఇతడు తన పూర్వికుడైన దావీదు చేసినట్టు పూర్తిగా చెయ్యకపోయినా, యెహోవా దృష్టిలో నీతి గలవాడిగా ఉండి అన్ని విషయాల్లోనూ తన తండ్రి యోవాషు చేసినట్టు చేశాడు.

4అయితే అతడు ఉన్నత స్థలాలను పడగొట్టలేదు. ప్రజలు ఇంకా ఉన్నత స్థలాల్లో బలులర్పిస్తూ ధూపం వేయడం కొనసాగిస్తూనే ఉన్నారు.

5రాజ్యంలో తాను రాజుగా స్థిరపడిన తరువాత రాజైన తన తండ్రిని చంపిన తన సేవకులను అతడు హతం చేయించాడు.

6అయితే “కొడుకులు చేసిన నేరాన్నిబట్టి తండ్రులకు మరణశిక్ష విధించకూడదు, తండ్రుల నేరాన్నిబట్టి కొడుకులకు మరణశిక్ష విధించకూడదు. ఎవరి పాపాని బట్టి వారే మరణ శిక్ష పొందాలి” అని మోషేకు యెహోవా రాసి ఇచ్చిన ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞను బట్టి ఆ హంతకుల పిల్లలను అతడు హతం చేయలేదు.

7ఇంకా అతడు ఉప్పు లోయలో యుద్ధం చేసి ఎదోమీయుల్లో 10,000 మందిని హతం చేసి, సెల అనే పట్టణాన్ని జయించి, దానికి యొక్తయేలు అని పేరు పెట్టాడు. ఈ రోజు వరకూ దానికి అదే పేరు.

8అప్పుడు అమజ్యా ఇశ్రాయేలు రాజు యెహూకు పుట్టిన యెహోయాహాజు కొడుకు యెహోయాషు దగ్గరికి వార్తాహరులను పంపి “మనం ముఖాముఖి యుద్ధం చేద్దాం రా” అన్నాడు.

9ఇశ్రాయేలు రాజు యెహోయాషు యూదా రాజు అమజ్యాకు ఇలా చెప్పి పంపాడు. “లెబానోనులో ఉన్న ముళ్ళ చెట్టొకటి ‘నీ కూతుర్ని నా కొడుక్కి ఇవ్వు’ అని లెబానోనులో ఉన్న దేవదారు వృక్షానికి కబురంపిందట. అంతలోనే లెబానోనులో ఉన్న అడవి మృగం ఒకటి వచ్చి ఆ ముళ్ళ చెట్టును తొక్కేసింది.

10నీవు ఎదోమీయులను హతమార్చిన కారణంగా హృదయంలో మిడిసి పడుతున్నావు. నీకు కలిగిన విజయాన్నిబట్టి అతిశయపడు గానీ నీ ఇంటి దగ్గరే ఉండు. నీవు మాత్రమే కాకుండా నీతోబాటు యూదావారు కూడా నాశనం కావడానికి నీవు ఎందుకు కారణం కావాలి?”

11అమజ్యా ఆ మాట వినలేదు. ఇశ్రాయేలు రాజు యెహోయాషు బయలుదేరి, యూదాకు సంబంధించిన బేత్షెమెషు పట్టణం దగ్గర యూదా రాజు అమజ్యాతో ముఖాముఖీ తలపడ్డాడు.

12యూదావారు ఇశ్రాయేలు వాళ్ళతో యుద్ధంలో ఓడిపోయి అందరూ తమ గుడారాలకు పారిపోయారు.

13ఇంకా, అహజ్యాకు పుట్టిన యోవాషు కొడుకు అమజ్యా అనే యూదారాజును ఇశ్రాయేలు రాజైన యెహోయాషు బేత్షెమెషు దగ్గర పట్టుకుని యెరూషలేముకు వచ్చి, ఎఫ్రాయిము గుమ్మం మొదలు మూల గుమ్మం వరకూ యెరూషలేము ప్రాకారం గోడలను 400 మూరల పొడుగున పడగొట్టాడు.

14ఇంకా, యెహోవా మందిరంలో, రాజనగరులో కనబడిన వెండి బంగాపాత్రలన్నీ, బందీలను కూడా తీసుకుని షోమ్రోనుకు వచ్చాడు.

15యెహోయాషు చేసిన ఇతర పనులు గురించి, అతని పరాక్రమాన్ని గురించి, యూదారాజు అమజ్యాతో అతడు చేసిన యుద్ధం గురించి, ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో రాసి ఉంది.

16యెహోయాషు చనిపోయినప్పుడు, అతని పూర్వీకులతోబాటు షోమ్రోనులో ఇశ్రాయేలు రాజుల సమాధిలో పాతిపెట్టారు. ఆ తరువాత అతని కొడుకు యరొబాము అతని స్థానంలో రాజయ్యాడు.

17యూదా రాజు యోవాషు కొడుకు అమజ్యా, ఇశ్రాయేలు రాజు యెహోయాహాజు కొడుకు అయిన యెహోయాషు చనిపోయిన తరువాత 15 సంవత్సరాలు జీవించాడు.

18అమజ్యా చేసిన ఇతర పనుల గురించి యూదా రాజుల చరిత్ర గ్రంథంలో రాసి ఉంది.

19ప్రజలు యెరూషలేములో అతని మీద కుట్ర చేయగా అతడు లాకీషు పట్టణానికి పారిపోయాడు. కాని, వారు అతనివెంట కొందరిని లాకీషుకు పంపారు.

20వారు అక్కడ అతన్ని చంపి గుర్రాల మీద అతని శవాన్ని యెరూషలేముకు తెప్పించి దావీదు పట్టణంలో అతని పూర్వీకుల సమాధిలో పాతిపెట్టారు.

21అప్పుడు యూదా ప్రజలు 16 సంవత్సరాల వయస్సు ఉన్న అజర్యాను అతని తండ్రి అమజ్యాకు బదులుగా పట్టాభిషేకం చేశారు.

22ఇతడు రాజైన తన తండ్రి తన పూర్వీకులతోబాటు చనిపోయిన తరువాత ఏలతు అనే పట్టణాన్ని చక్కగా కట్టించి యూదా వాళ్లకు దాన్ని మళ్ళీ అప్పగించాడు. 1 ఇశ్రాయేలు రాజైన రెండవ యరొబాము

23యూదా రాజు యోవాషు కొడుకు అమజ్యా పరిపాలనలో 15 వ సంవత్సరంలో ఇశ్రాయేలు రాజు యెహోయాషు కొడుకు యరొబాము షోమ్రోనులో పరిపాలన ఆరంభించి, 41 సంవత్సరాలు రాజుగా ఉన్నాడు.

24ఇతడు కూడా ఇశ్రాయేలు వారు పాపం చెయ్యడానికి కారకుడైన నెబాతు కొడుకు యరొబాము చేసిన పాపాలు విడిచిపెట్టకుండా వాటినే అనుసరించి యెహోవా దృష్టిలో చెడుతనం జరిగించాడు.

25ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవా గత్హేపెరు ఊరివాడైన అమిత్తయికి పుట్టిన తన సేవకుడు యోనా అనే ప్రవక్త ద్వారా చెప్పిన మాట చొప్పున ఇతడు హమాతుకు వెళ్ళే దారి మొదలుకుని అరాబా సముద్రం వరకూ ఇశ్రాయేలువాళ్ళ సరిహద్దును మళ్ళీ స్వాధీనం చేసుకున్నాడు.

26దాసులుగాని, స్వతంత్రులుగాని, ఇశ్రాయేలు వాళ్లకు సహాయం చెయ్యడానికి ఎవ్వరూ లేరు.

27కాబట్టి యెహోవా ఇశ్రాయేలు వారు పడిన బాధ ఎంతో ఘోరమైనదిగా ఎంచాడు. ఇశ్రాయేలు అనే పేరు ఆకాశం కింద నుంచి తుడిచి వేయనని యెహోవా చెప్పాడు గనుక యెహోయాషు కొడుకు యరొబాము ద్వారా వాళ్ళను రక్షించాడు.

28యరొబాము చేసిన ఇతర పనుల గురించి, అతడు చేసిన దానంతటి గురించి, అతని పరాక్రమం గురించి, అతడు చేసిన యుద్ధం గురించి, దమస్కు పట్టణాన్ని, యూదావాళ్లకు ఉన్న హమాతు పట్టణాన్ని ఇశ్రాయేలు కోసం అతడు మళ్ళీ జయించిన సంగతిని గురించి, ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో రాసి ఉంది.

29యరొబాము తన పూర్వీకులైన ఇశ్రాయేలు రాజులతోబాటు చనిపోయిన తరువాత అతని కొడుకు జెకర్యా అతని స్థానంలో రాజయ్యాడు.

← 2 Kings 13Read In The App, Free →2 Kings 15 →

Study 2 Kings 14

KJVMatthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)Reina-Valera (Español)Bíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)

All Chapters

12345678910111213141516171819202122232425