Ezekiel · బైబిల్ (తెలుగు)

Ezekiel 33

1యెహోవా నాకీ విషయం తెలియచేశాడు.

2“నరపుత్రుడా, నువ్వు నీ ప్రజలకు ఈ విషయం చెప్పు, నేను ఒకానొక దేశం మీదికి కత్తి రప్పిస్తే ఆ ప్రజలు తమలో ఒకణ్ణి ఎన్నుకుని కావలివానిగా ఏర్పరచుకున్నారనుకో.

3అతడు దేశం మీదికి కత్తి రావడం చూసి, బూర ఊది ప్రజలను హెచ్చరిక చేస్తాడనుకో.

4అప్పుడు ఎవడైనా బూర శబ్దం విని కూడా జాగ్రత్తపడక పోతే, కత్తి వచ్చి వాడి ప్రాణం తీసేస్తే వాడు తన చావుకు తానే బాధ్యుడు.

5బూర శబ్దం విని కూడా వాడు జాగ్రత్త పడలేదు కాబట్టి తన చావుకు తానే బాధ్యుడు. వాడు జాగ్రత్త పడితే తన ప్రాణాన్ని రక్షించుకునేవాడే.

6అయితే కావలివాడు కత్తి రావడం చూసినా కూడా, బూర ఊదకుండా ప్రజలను హెచ్చరించకుండా ఉన్నాడనుకో. కత్తి వచ్చి వాళ్ళలో ఒకడి ప్రాణం తీస్తే, వాడు తన దోషాన్ని బట్టి చస్తాడు. కానీ, అతని చావుకు నేను కావలి వాడినే బాధ్యుని చేస్తాను.

7నరపుత్రుడా, నేను నిన్ను ఇశ్రాయేలీయులకు కావలివాడిగా నియమించాను. కాబట్టి నువ్వు నా నోటి మాట విని నా పక్షంగా వారిని హెచ్చరించాలి.

8‘దుర్మార్గుడా, నువ్వు తప్పకుండా చస్తావు’ అని దుర్మార్గుడికి నేను చెబితే, నువ్వు అతణ్ణి హెచ్చరించకపోతే ఆ దుర్మార్గుడు తన దోషాన్ని బట్టి చస్తాడు. అయితే అతని చావుకు నిన్నే బాధ్యుని చేస్తాను.

9అయితే ఆ దుర్మార్గుడు తన దుర్మార్గతను విడిచిపెట్టాలని నువ్వు అతన్ని హెచ్చరించావనుకో. అతడు తన దుర్మార్గం విడిచి పెట్టకపోతే అతడు తన దోషాన్ని బట్టి చస్తాడు గానీ నువ్వు అతని చావుకు బాధ్యుడివి కాదు.

10నరపుత్రుడా, ఇశ్రాయేలీయులకు ఈ విషయం తెలియచెయ్యి. ‘మా అపరాధాలూ పాపాలూ మా మీద భారంగా ఉన్నాయి. వాటి వలన మేము నీరసించిపోతున్నాము. మేమెలా బతుకుతాం?’ అని మీరంటున్నారు.

11వారితో ఇలా చెప్పు, నా జీవం మీద ఆనబెట్టి చెబుతున్నాను, దుర్మార్గుడు చస్తే నాకేమీ సంతోషం లేదు. దుర్మార్గుడు తన పద్ధతిని బట్టి పశ్చాత్తాపపడి బతకాలి. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మనస్సు మార్చుకోండి. మీ దుర్మార్గతనుంచి పశ్చాత్తాప పడండి. మీరెందుకు చావాలి? ఇదే యెహోవా ప్రభువు సందేశం.

12నరపుత్రుడా, నువ్వు నీ ప్రజలకు ఈ మాట చెప్పు. నీతిమంతుడు పాపం చేస్తే అతడు అనుసరించిన నీతి అతన్ని విడిపించదు! దుష్టుడు చెడుతనం విడిచి మనస్సు మార్చుకుంటే తాను చేసిన దుర్మార్గాన్ని బట్టి వాడు నాశనం కాడు. అలాగే నీతిమంతుడు పాపం చేస్తే తన నీతిని బట్టి అతడు బతకడు.

13నీతిమంతుడు తప్పక బతుకుతాడు, అని నేను చెప్పినందువలన అతడు తన నీతిని నమ్ముకుని పాపం చేస్తే మునుపు అతడు చేసిన నీతి పనులన్నిటిలో ఏదీ జ్ఞాపకానికి రాదు. తాను చేసిన పాపాన్ని బట్టి అతడు చస్తాడు.

14‘తప్పకుండా చస్తావు’ అని దుర్మార్గునికి నేను చెప్పిన తరువాత అతడు తన పాపం విడిచి, నీతి న్యాయాలను అనుసరిస్తూ

15తన దగ్గర అప్పు తీసుకున్నవాడికి తాకట్టు మళ్ళీ అప్పగించి, తాను దొంగిలించినదాన్ని మళ్ళీ ఇచ్చి వేసి పాపం చేయకుండా, జీవాధారమైన చట్టాలను అనుసరిస్తే అతడు చావడు. తప్పకుండా బతుకుతాడు.

16అతడు చేసిన పాపాల్లో ఏదీ అతని విషయం జ్ఞాపకానికి రాదు. అతడు నీతిన్యాయాలను అనుసరిస్తున్నాడు కాబట్టి తప్పకుండా అతడు బతుకుతాడు.

17అయినా నీ ప్రజలు ‘యెహోవా పద్ధతి న్యాయం కాదు’ అంటారు. అయితే వారి పద్ధతే అన్యాయమైనది.

18నీతిమంతుడు తన నీతిని విడిచి, పాపం చేస్తే ఆ పాపాన్ని బట్టి అతడు చస్తాడు.

19దుర్మార్గుడు తన దుర్మార్గాన్ని విడిచి నీతిన్యాయాలను అనుసరిస్తే వాటిని బట్టి అతడు బతుకుతాడు.

20అయితే మీరు ‘యెహోవా పద్ధతి న్యాయం కాదు’ అంటారు. ఇశ్రాయేలీయులారా, మీలో ఎవడి ప్రవర్తననుబట్టి వాడికి శిక్ష విధిస్తాను.” 1 యెరూషలేము పతనం

21మనం చెరలోకి వచ్చిన పన్నెండవ సంవత్సరం పదో నెల అయిదో రోజు ఒకడు యెరూషలేములో నుండి తప్పించుకుని నా దగ్గరికి వచ్చి “పట్టణాన్ని పట్టుకున్నారు” అని చెప్పాడు.

22అతడు రాకముందు సాయంత్రం యెహోవా చెయ్యి నా మీద ఉంది. ఉదయాన అతడు నా దగ్గరికి వచ్చేముందే యెహోవా నా నోరు తెరచాడు. నేను మాట్లాడగలుగుతున్నాను. అప్పటినుంచి నేను మౌనంగా లేను.

23యెహోవా నాకీ విషయం తెలియచేశాడు.

24“నరపుత్రుడా, ఇశ్రాయేలు దేశంలో శిథిలాల్లో ఉంటున్నవాళ్ళు, ‘అబ్రాహాము ఒక్కడుగానే ఈ దేశాన్ని స్వాస్థ్యంగా పొందాడు. మనం అనేకులం. ఈ దేశం మనకు స్వాస్థ్యంగా వచ్చింది’ అని చెప్పుకుంటున్నారు.

25కాబట్టి వారికీ మాట చెప్పు, యెహోవా ప్రభువు తెలియజేసేది ఏమిటంటే, మీరు రక్తం తింటున్నారు. మీ విగ్రహాలను చూస్తూ ఉంటారు. మీరింకా హత్యలు చేస్తూ ఉన్నారు. కాబట్టి మీరు ఈ దేశాన్ని స్వతంత్రించుకుంటారా?

26మీరు మీ కత్తిని నమ్ముకుంటారు. నీచమైన పనులు చేస్తారు. పక్కింటివాడి భార్యను పాడు చేస్తారు. కాబట్టి మీరు ఈ దేశాన్ని స్వతంత్రించుకుంటారా?

27వారికి నువ్విలా చెప్పు, యెహోవా ప్రభువు తెలియజేసేది ఏమిటంటే, నా జీవం తోడు. శిథిలాల్లో ఉంటున్నవాళ్ళు, కత్తి పాలవుతారు. బయట పొలాల్లో ఉండే వాళ్ళను నేను అడవి జంతువులకు ఆహారంగా ఇస్తాను. కోటల్లో గుహల్లో ఉండేవాళ్ళు రోగాలతో చస్తారు.

28ఆ దేశాన్ని నిర్జనంగా పాడుచేస్తాను. దాని బలాతిశయం అంతం అవుతుంది. ఇశ్రాయేలు కొండలు నిర్జనంగా ఉంటాయి. ఎవరూ వాటి గుండా వెళ్ళరు.

29వారు చేసిన నీచమైన పనుల వలన వారి దేశాన్ని పాడుగా నిర్జనంగా నేను చేస్తే నేను యెహోవానని వారు తెలుసు కుంటారు.

30నరపుత్రుడా, నీ ప్రజలు గోడల దగ్గర, ఇంటి గుమ్మాల్లో నిలబడి ఒకరినొకరు నీ గురించి మాట్లాడుతూ, ‘యెహోవా దగ్గర నుంచి వచ్చే ప్రవక్త మాట విందాం పదండి’ అని చెప్పుకుంటున్నారు.

31నా ప్రజలు ఎప్పుడూ వచ్చేలాగే నీ దగ్గరికి వస్తారు. నీ ఎదుట కూర్చుని నీ మాటలు వింటారు గాని వాటిని పాటించరు. సరైన మాటలు వాళ్ళు చెబుతారు గానీ వాళ్ళ మనసులు అక్రమ లాభం కోసం ఆరాటపడుతున్నాయి.

32నువ్వు వాళ్లకు, తీగ వాయిద్యంతో చక్కటి సంగీత కచేరీ చేస్తూ కమ్మగా పాడే వాడిలా ఉన్నావు. వాళ్ళు నీ మాటలు వింటారు గానీ ఎవ్వరూ వాటిని పాటించరు.

33తప్పక జరుగుతాయి అని నేను చెప్పినవన్నీ జరుగుతాయి. అప్పుడు వాళ్ళ మధ్య ఒక ప్రవక్త ఉన్నాడని వాళ్ళు తెలుసుకుంటారు.”

← Ezekiel 32Read In The App, Free →Ezekiel 34 →

Study Ezekiel 33

KJVMatthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)Reina-Valera (Español)Bíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)

All Chapters

123456789101112131415161718192021222324252627282930313233343536373839404142434445464748