Ezekiel · బైబిల్ (తెలుగు)

Ezekiel 44

1ఆ మనిషి నన్ను తూర్పువైపు తిరిగి ఉన్న పరిశుద్ధ స్థలం బయటి ప్రవేశద్వారానికి తీసుకువచ్చాడు. ఆ గుమ్మం మూసి ఉంది.

2అప్పుడు యెహోవా నాతో ఈ మాట చెప్పాడు. “ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఈ గుమ్మంలో నుండి లోపలికి ప్రవేశించాడు కాబట్టి ఏ మనిషీ ప్రవేశింపకుండేలా అది గట్టిగా మూసి ఉంది. ఇక అది ఎన్నటికీ తీయకూడదు.

3ఇశ్రాయేలు పాలకుడు ఆహారం భుజించేటప్పుడు యెహోవా సన్నిధిలో అక్కడ కూర్చుంటాడు. అయితే అతడు ఈ ద్వారం వసారాగుండా ప్రవేశించి వసారా గుండా బయటికి వెళ్ళాలి.”

4తరవాత అతడు నన్ను ఉత్తర ప్రవేశద్వారం గుండా మందిరం ముందు భాగానికి తీసుకు వచ్చాడు. అంతలో మందిరం యెహోవా మహిమ తేజస్సుతో నిండి ఉండడం చూసి నేను సాగిలపడ్డాను.

5యెహోవా నాతో ఇలా చెప్పాడు. “నరపుత్రుడా, యెహోవా మందిరం గురించిన కట్టడలు, విధులు అన్నిటిని నేను నీకు తెలియజేస్తున్నాను, నీవు శ్రద్ధగా గమనించు. ఈ సంగతులన్నిటిని నీ కళ్ళతో చూసి చెవులతో ఆలకించు. మందిరం బయటికి పోయే, లోపలి వచ్చే మార్గాలను గూర్చి ఆలోచించు.

6తిరుగుబాటు చేసే ఇశ్రాయేలీయులకు ఈ మాట ప్రకటించు, ప్రభువైన యెహోవా చెప్పేదేమిటంటే, ‘ఇశ్రాయేలీయులారా, ఇంతవరకూ మీరు చేసిన అకృత్యాలు చాలు.

7మీరు నాకు ఆహారం, కొవ్వు, రక్తం, అర్పించే సమయాల్లో హృదయంలో శరీరంలో సున్నతి లేని అన్యులను నా పరిశుద్ధ స్థలంలోకి తీసుకువచ్చారు. వారు మీ అకృత్యాలను ఆధారం చేసుకుని దాన్ని అపవిత్రపరచి నా నిబంధనను భంగపరిచారు.

8నేను మీకు అప్పగించిన నా పరిశుద్ధమైన ఆవరణను మీరు కాపాడకపోగా, ఆ బాధ్యతను అన్యులకు అప్పగించారు.’

9కాబట్టి ప్రభువైన యెహోవా చెప్పేదేమిటంటే, ఇశ్రాయేలీయుల మధ్య నివసిస్తూ ఉండి హృదయంలో, శరీరంలో సున్నతి లేని అన్యుల్లో ఎవరూ నా పరిశుద్ధస్థలాల్లో ప్రవేశింపకూడదు.

10ఇశ్రాయేలీయులు నన్ను విసర్జించి తమ విగ్రహాలను అనుసరించినప్పుడు, వారితోబాటు నాకు దూరమైన లేవీయులు తమ దోషాన్ని భరించాలి.

11వారు నా పరిశుద్ధ స్థలాల్లో పరిచర్య చేసేవారు, నా మందిరానికి ద్వారపాలకులుగా మందిర పరిచర్య జరిగించేవారు, ప్రజల పక్షంగా వారే దహనబలి పశువులను వధించి, బలులు అర్పించేవారు. పరిచర్య చేయడానికి ప్రజల సమక్షంలో నిలిచేవారు వారే.

12అయితే విగ్రహాల ఎదుట ప్రజలకు పరిచారకులై ఇశ్రాయేలీయులు పడిపోయి పాపం చేయడానికి వారు కారకులయ్యారు కాబట్టి నేను వారికి విరోధినయ్యాను. కాబట్టి వారు తమ దోషాన్ని భరిస్తారు.” ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.

13“వారు యాజకత్వం జరిగించడానికి నా సన్నిధికి రాకూడదు, పరిశుద్ధ వస్తువులను గాని అతి పరిశుద్ధ వస్తువులను గాని ముట్టకూడదు. దానికి బదులు వారు చేసిన అకృత్యాలకు కలిగే అవమానాన్ని, శిక్షను వారనుభవిస్తారు.

14అయితే నా మందిర సంబంధమైన పని అంతటిని, దానిలో జరుగు పనులన్నిటిని పర్యవేక్షిస్తూ దాన్ని కాపాడేవారిగా నేను వారిని నియమిస్తున్నాను.

15ఇశ్రాయేలీయులు నన్ను తోసిపుచ్చినపుడు నా పరిశుద్ధ స్థలాన్ని కాపాడి కనిపెట్టే లేవీయులైన సాదోకు సంతతి యాజకులు పరిచర్య చేయడానికి నా సన్నిధికి వచ్చి నా సన్నిధిలో నిలబడి, కొవ్వును, రక్తాన్ని నాకు అర్పిస్తారు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.

16వారే నా పరిశుద్ధస్థలంలో ప్రవేశిస్తారు. వారే నా బల్ల దగ్గరికి వచ్చి పరిచర్య చేస్తారు. వారే నేనప్పగించిన దాన్ని కాపాడతారు.” ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.

17“వారు లోపలి ఆవరణ గుమ్మాల్లోకి వచ్చేటప్పుడు జనపనార బట్టలు ధరించుకోవాలి. వారు ఆ గుమ్మాల గుండా మందిరంలో ప్రవేశించి పరిచర్య చేసేటప్పుడు బొచ్చుతో చేసిన బట్టలు ధరింపకూడదు.

18అవిసెనార పాగాలు ధరించుకుని నడుములకు జనప నారబట్ట కట్టుకోవాలి. చెమట పుట్టించేది దేనినీ వారు ధరింపకూడదు.

19బయటి ఆవరణంలోని ప్రజల దగ్గరికి వెళ్ళేటప్పుడు వారు తమ ప్రతిష్ఠిత వస్త్రాలు తీసివేసి, వాటిని ప్రతిష్టితమైన గదుల్లో ఉంచి వేరే వస్త్రాలు ధరించాలి. ఆ విధంగా వారి ప్రతిష్టిత వస్త్రాలను తాకిన ప్రజలు కూడా ప్రతిష్ఠితం కాకుండా ఉంటారు.

20వారు తమ తలలు క్షౌరం చేయించుకోకూడదు. తలవెండ్రుకలు పొడవుగా పెరగనియ్యకుండా వాటిని కత్తిరించాలి.

21లోపలి ఆవరణంలో ప్రవేశించేటపుడు ఏ యాజకుడూ ద్రాక్షారసం తాగకూడదు.

22వారు విధవరాళ్ళనైనా భర్త విడిచిపెట్టినవారినైనా పెళ్ళి చేసుకోకూడదు. ఇశ్రాయేలీయుల వంశాల్లోని కన్యలనైనా, యాజకులకు భార్యలై విధవరాళ్ళుగా ఉన్నవారినైనా చేసుకోవచ్చు.

23ప్రతిష్ఠితమైన దానికి, ప్రతిష్టితం కానిదానికి మధ్య, పవిత్రమైనదానికి, అపవిత్రమైనదానికి మధ్య తేడా ఏమిటో వారు నా ప్రజలకు నేర్పాలి.

24ప్రజల వ్యాజ్యాల్లో వారు నా విధులను బట్టి వారికి తీర్పు తీరుస్తారు. నేను నియమించిన విధులను బట్టి, కట్టడలను బట్టి, నా పండగలను జరుపుతారు. నా విశ్రాంతి దినాలను ఆచరిస్తారు.

25తండ్రి, తల్లి, కుమారుడు, కుమార్తె, సోదరుడు, పెళ్ళి కాని సోదరి, వీరి శవాలు తప్ప మరే ఇతర శవాలను ముట్టినా వారు అపవిత్రులవుతారు.

26ఒక యాజకుడు ఆ విధంగా మైల పడితే ప్రజలు ఏడు రోజులు లెక్కించాలి.

27అతడు పరిచర్య చేయడానికి లోపలి ఆవరణంలోని పరిశుద్ధస్థలానికి రావడానికి ముందు అతడు తనకోసం పాప పరిహారార్థబలి అర్పించాలి. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.

28వారికి స్వాస్థ్యం ఇదే. నేనే వారికి స్వాస్థ్యం. ఇశ్రాయేలీయుల్లో వారికెంత మాత్రం స్వాస్థ్యం ఇవ్వకూడదు. నేనే వారికి స్వాస్థ్యం.

29నైవేద్యాలు, పాప పరిహారార్థ బలిమాంసం, అపరాధ పరిహారార్థ బలిమాంసం వారికి ఆహారమవుతాయి. ఇశ్రాయేలీయులు దేవునికి ప్రతిష్టించే వస్తువులన్నీ వారివే.”

30“మీ ప్రతిష్ఠితార్పణల్లో, తొలిచూలు వాటిలో, ప్రథమ ఫలాల్లో శ్రేష్ఠమైనవి యాజకులవి అవుతాయి. మీ కుటుంబాలకు ఆశీర్వాదం కలిగేలా మీరు ముందుగా పిసికిన పిండి ముద్దను యాజకులకు ఇవ్వాలి.

31పక్షుల్లో, పశువుల్లో దానికదే చచ్చినది గాని, మృగాలు చీల్చి చంపినవి గానీ యాజకులు తినకూడదు.”

← Ezekiel 43Read In The App, Free →Ezekiel 45 →

Study Ezekiel 44

KJVMatthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)Reina-Valera (Español)Bíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)

All Chapters

123456789101112131415161718192021222324252627282930313233343536373839404142434445464748