Genesis · బైబిల్ (తెలుగు)

Genesis 22

1ఈ సంగతులన్నీ జరిగిన తరువాత దేవుడు అబ్రాహామును పరీక్షించాడు. ఆయన “అబ్రాహామూ” అని పిలిచినప్పుడు అతడు “చిత్తం ప్రభూ” అన్నాడు.

2అప్పుడు ఆయన అబ్రాహాముతో “నువ్వు ప్రేమించే నీ ఒక్కగానొక్క కొడుకు ఇస్సాకును తీసుకుని మోరియా దేశానికి వెళ్ళు. అక్కడ నేను చెప్పబోయే ఒక పర్వతం మీద అతణ్ణి దహనబలిగా అర్పించు” అన్నాడు.

3కనుక అబ్రాహాము తెల్లవారగానే లేచి తన గాడిదకు జీను కట్టి సిద్ధం చేసి, దహనబలి కోసం కట్టెలు కొట్టి, తన కొడుకు ఇస్సాకుతో పాటు ఇద్దరు పనివాళ్ళనూ వెంటబెట్టుకుని దేవుడు తనకు చెప్పిన ప్రాంతానికి ప్రయాణమయ్యాడు.

4మూడవ రోజు అబ్రాహాము తలెత్తి దూరంగా ఉన్న ఆ స్థలాన్ని చూశాడు.

5తన పనివాళ్ళతో “మీరు గాడిదతో ఇక్కడే ఉండండి. నేనూ అబ్బాయీ అక్కడికి వెళ్లి దేవుణ్ణి ఆరాధించి తిరిగి మీ దగ్గరికి వస్తాం” అని చెప్పాడు.

6అప్పుడు అబ్రాహాము దహనబలి కోసం తెచ్చిన కట్టెలు తీసుకుని తన కొడుకు ఇస్సాకు తలపై పెట్టాడు. తన చేతిలో నిప్పు, కత్తి పట్టుకున్నాడు. ఇక వాళ్ళిద్దరూ కలసి కొండపైకి ఎక్కుతున్నారు.

7ఇస్సాకు తన తండ్రి అబ్రాహామును “నాన్నా” అని పిలిచాడు. దానికి అబ్రాహాము “ఏం నాయనా” అన్నాడు. అప్పుడతడు “చూడండి, మన దగ్గర నిప్పూ కట్టెలూ ఉన్నాయి గానీ దహనబలికి గొర్రె పిల్ల ఏది?” అని అడిగాడు.

8దానికి అబ్రాహాము “కొడుకా, దహనబలికి గొర్రెపిల్లను దేవుడే దయచేస్తాడు” అన్నాడు.

9దేవుడు అబ్రాహాముకు చెప్పిన స్థలానికి వారు చేరుకున్నారు. అక్కడ అబ్రాహాము ఒక బలిపీఠం నిర్మించి దానిపై కట్టెలు పేర్చాడు. ఇస్సాకును తాళ్ళతో బంధించాడు. ఆ బలిపీఠంపై పేర్చిన కట్టెలపై అతణ్ణి పడుకోబెట్టాడు.

10తరువాత అబ్రాహాము తన కుమారుణ్ణి వధించడానికి చెయ్యి చాపి కత్తి పట్టుకున్నాడు.

11అప్పుడు ఆకాశం నుండి యెహోవా దూత “అబ్రాహామూ, అబ్రాహామూ” అని పిలిచాడు. దానికతడు “చిత్తం ప్రభూ” అన్నాడు.

12అప్పుడు ఆయన “ఆ బాలునిపై చెయ్యి వేయకు. అతనికి ఏ హానీ తలపెట్టవద్దు. నీకున్న ఒక్కగానొక్క కొడుకుని నాకివ్వడానికి వెనుకంజ వేయలేదు. అది చూశాక నీకు దేవునిపట్ల భయభక్తులు ఉన్నాయని నాకు తెలిసింది” అన్నాడు.

13అప్పుడు అబ్రాహాము తలెత్తి చూశాడు. ఆశ్చర్యం కలిగించేలా అక్కడ ఉన్న ఒక పొదలో కొమ్ములు చిక్కుకుని ఉన్న ఒక పొట్టేలు అతనికి కనిపించింది. అబ్రాహాము వెళ్ళి ఆ పోట్టేలుని పట్టుకుని తన కొడుక్కి బదులుగా దాన్ని దహనబలిగా అర్పించాడు.

14అబ్రాహాము ఆ చోటును “ + 22:14 అంటే యెహోవా చూసుకుంటాడు.యెహోవా యీరే” అని పిలిచాడు. కాబట్టి “యెహోవా తన పర్వతం పైన దయచేస్తాడు” అనే మాట ఈ నాటి వరకూ నిలిచి వాడుకలో ఉంది.

15యెహోవా దూత రెండవసారి ఆకాశం నుండి అబ్రాహామును పిలిచి ఇలా అన్నాడు

16“నువ్వు నీ ఒక్కగానొక్క కొడుకుని ఇవ్వడానికి వెనుకంజ వేయకుండా ఇదంతా చేశావు. అందుకే ప్రమాణం చేస్తున్నాను.

17నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నీ వారసులను ఆకాశంలో ఉండే నక్షత్రాల వలే, సముద్ర తీరంలో ఉండే ఇసుక రేణువులవలే అత్యధికంగా విస్తరించేలా చేస్తాను. నీ వారసులు తమ శత్రువుల భూములను స్వాధీనం చేసుకుంటారు.

18నువ్వు నా మాట విన్నావు కనుక నీ సంతానం వల్ల భూమి పైన ఉన్న జాతులన్నిటినీ ఆశీర్వదిస్తాను.”

19తరువాత అబ్రాహాము తన పనివాళ్ళ దగ్గరికి వచ్చాడు. వాళ్ళంతా కలసి బెయేర్షెబాకు వెళ్ళారు. అబ్రాహాము బెయేర్షెబాలో నివసించాడు. 1 నాహోరు సంతతి

20ఆ సంగతులన్నీ జరిగిన తరువాత తన సోదరుడైన నాహోరుకు మిల్కా ద్వారా పిల్లలు కలిగారు అనే వార్త అబ్రాహాముకు చేరింది.

21ఆ పిల్లలు ఎవరంటే, పెద్ద కొడుకు ఊజు, అతడి తమ్ముడు బూజు, అరాము తండ్రి కెమూయేలు,

22కెసెదు, హజో, పిల్దాషు, జిద్లాపు, బెతూయేలు. ఈ బెతూయేలు రిబ్కాకు తండ్రి.

23అబ్రాహాము సోదరుడైన నాహోరుకు ఆ ఎనిమిదిమందీ మిల్కా ద్వారా కలిగారు.

24అతని ఉంపుడుకత్తె రెయూమా ద్వారా అతనికి తెబహు, గహము, తహషు, మయకా పుట్టారు.

← Genesis 21Read In The App, Free →Genesis 23 →

Study Genesis 22

KJVMatthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)Reina-Valera (Español)Bíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)

All Chapters

1234567891011121314151617181920212223242526272829303132333435363738394041424344454647484950