Genesis · బైబిల్ (తెలుగు)

Genesis 23

1శారా నూట ఇరవై ఏడు సంవత్సరాలు జీవించింది.

2కనాను దేశంలో హెబ్రోను అని పిలిచే కిరియత్ ఆర్బా అనే ప్రాంతంలో ఆమె మరణించింది. అప్పుడు అబ్రాహాము శారా కోసం దుఃఖించడానికి, విలపించడానికీ వచ్చాడు.

3తరువాత అబ్రాహాము చనిపోయిన తన భార్య దగ్గరనుండి లేచి హేతు వారసులతో ఇలా మాట్లాడాడు,

4“నేను మీ మధ్య ఒక పరదేశిగానూ పరాయి వాడిగానూ ఉన్నాను. చనిపోయిన నా భార్య నా కళ్ళెదుట ఉంది. చనిపోయిన నా వాళ్ళను పాతిపెట్టడానికి నాకు ఒక స్మశాన భూమిని సొంతానికి ఇవ్వండి” అన్నాడు.

5దానికి హేతు వారసులు ఇలా అన్నారు “అయ్యా, మేము చెప్పేది వినండి. నువ్వు మా మధ్య ఒక మహారాజులా ఉన్నావు.

6మా శ్మశాన భూముల్లో అతి శ్రేష్ఠమైన దాంట్లో చనిపోయిన నీ వాళ్ళను పాతి పెట్టు. చనిపోయిన నీ భార్యను పాతి పెట్టడానికి మాలో ఎవరూ తమ భూమిని నీకివ్వడానికి నిరాకరించరు.”

7అప్పుడు అబ్రాహాము లేచి ఆ దేశ ప్రజలైన హేతు వారసుల ముందు సాగిల పడ్డాడు.

8“చనిపోయిన నా భార్యను పాతిపెట్టే విషయంలో మీరు నాతో ఏకీభవిస్తే నా మాట వినండి. సోహరు కొడుకైన ఎఫ్రోనుతో నా తరపున మాట్లాడండి.

9అతని పొలం చివరన ఉన్న మక్పేలా గుహను నాకు ఇమ్మని అతనితో మనవి చేయండి. అది నా సొంత స్మశానంగా ఉండటానికి దాన్ని పూర్తి వెలకు నాకు అమ్మమని చెప్పండి” అన్నాడు.

10ఆ ఎఫ్రోను హేతు సంతతివారి మధ్యలోనే కూర్చుని ఉన్నాడు. హిత్తీయుడైన ఎఫ్రోను ఆ పట్టణ ద్వారం లో ప్రవేశించే వారందరి ముందు హేతు సంతతివారు వింటుండగా అబ్రాహాముకు ఇలా చెప్పాడు.

11“అయ్యా, అలా కాదు. నేను చెప్పేది వినండి. ఆ పొలాన్నీ దానిలో ఉన్న గుహను కూడా మీకిస్తున్నాను. నా ప్రజలందరి సమక్షంలోనే దాన్ని మీకిస్తున్నాను. చనిపోయిన మీ భార్యను పాతిపెట్టడానికి మీకిస్తున్నాను.”

12అప్పుడు అబ్రాహాము ఆ దేశపు ప్రజల ముందు సాగిల పడ్డాడు.

13“నీ కిష్టమైతే నా మనవి విను. ఆ పొలానికి వెల చెల్లిస్తాను. నా దగ్గర వెల పుచ్చుకో. అప్పుడు నా భార్యను అక్కడ పాతిపెడతాను” అని అందరికీ వినపడేలా చెప్పాడు.

14దానికి ఎఫ్రోను ఇలా జవాబిచ్చాడు.

15“అయ్యా, విను. ఆ భూమి వెలగా నాలుగు వందల షెకెల్ల వెండి చెల్లిస్తే చాలు. ఆ మాత్రం మొత్తం నీకూ నాకూ ఎంత? చనిపోయిన నీ భార్యను పాతిపెట్టుకో” అన్నాడు.

16అబ్రాహాము ఎఫ్రోను చెప్పిన మాట విన్నాడు. హేతు కుమారులకు వినబడేలా ఎఫ్రోను చెప్పిన వెలను అంటే వర్తకుల తూకం ప్రకారం + 23:16 సుమారు నాలుగున్నర కిలోలు.నాలుగు వందల షెకెల్ల వెండిని అబ్రాహాము తూచి అతనికి ఇచ్చాడు.

17ఆ విధంగా మమ్రే పక్కనే ఉన్న మక్పేలా లోని ఎఫ్రోను పొలం, దాంట్లో ఉన్న గుహ, ఆ పొలంలోనూ దాని సరిహద్దుల్లోనూ ఉన్న చెట్లతో సహా

18ఆ ఊరి ద్వారంలో ప్రవేశించే వారందరి ముందు హేతు వారసుల సమక్షంలో అబ్రాహాముకు స్వాధీనం అయింది.

19ఆ తరువాత అబ్రాహాము కనాను దేశంలో హెబ్రోను అని పిలిచే మమ్రే పక్కనే ఉన్న మక్పేలా పొలం లోని గుహలో తన భార్య శారాను పాతిపెట్టాడు.

20ఆ విధంగా ఆ పొలాన్నీ, దాంట్లో ఉన్న గుహనీ శ్మశానం కోసం అబ్రాహాముకు హేతు సంతతి వారు ఇవ్వడం వల్ల అవి అతని సొంతం అయ్యాయి.

← Genesis 22Read In The App, Free →Genesis 24 →

Study Genesis 23

KJVMatthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)Reina-Valera (Español)Bíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)

All Chapters

1234567891011121314151617181920212223242526272829303132333435363738394041424344454647484950