Jeremiah · బైబిల్ (తెలుగు)

Jeremiah 28

1యూదా రాజు సిద్కియా పరిపాలన మొదట్లో నాలుగో సంవత్సరం అయిదో నెలలో గిబియోనువాడు, అజ్జూరు ప్రవక్త కొడుకు హనన్యా యాజకుల ఎదుట, ప్రజలందరి ఎదుట యెహోవా మందిరంలో నాతో ఇలా అన్నాడు,

2“ఇశ్రాయేలు దేవుడు, సేనల అధిపతి యెహోవా ఇలా చెబుతున్నాడు, ‘నేను బబులోను రాజు కాడిని విరిచేశాను.

3రెండేళ్లలో బబులోను రాజు నెబుకద్నెజరు ఈ స్థలంలో నుంచి బబులోనుకు తీసుకుపోయిన యెహోవా మందిరంలోని పాత్రలన్నీ ఇక్కడికి మళ్ళీ తెప్పిస్తాను.

4బబులోను రాజు కాడిని విరగగొట్టి యెహోయాకీము కొడుకు యూదా రాజు యెకొన్యాను, బబులోనుకు బందీలుగా తీసుకుపోయిన యూదులందరినీ ఈ స్థలానికి తిరిగి రప్పిస్తాను.’ ఇదే యెహోవా వాక్కు.”

5అప్పుడు ప్రవక్త అయిన యిర్మీయా యాజకుల ఎదుట, యెహోవా మందిరంలో నిలబడి ఉన్న ప్రజలందరి ఎదుట హనన్యా ప్రవక్తతో ఇలా అన్నాడు,

6“యెహోవా దీనిని చేస్తాడు గాక! యెహోవా మందిరపు పాత్రలన్నీ బందీలుగా తీసుకుపోయిన వారందరినీ యెహోవా బబులోనులో నుంచి ఈ స్థలానికి తెప్పించి నువ్వు ప్రకటించిన మాటలను నెరవేరుస్తాడు గాక!

7అయినా నువ్వు వింటుండగా ఈ ప్రజలందరూ వింటుండగా నేను చెబుతున్న మాట విను.

8నాకూ నీకూ ముందున్న ప్రవక్తలు, అనేక దేశాలకూ గొప్ప రాజ్యాలకూ వ్యతిరేకంగా యుద్ధాలు జరుగుతాయనీ కీడు సంభవిస్తుందనీ అంటురోగాలు వస్తాయనీ ఎప్పటినుంచో ప్రవచిస్తూ ఉన్నారు.

9అయితే క్షేమం కలుగుతుందని ప్రకటించే ప్రవక్త మాట నెరవేరితే అతన్ని నిజంగా యెహోవాయే పంపాడని తెలుసుకోవచ్చు,” అని యిర్మీయా ప్రవక్త చెప్పాడు.

10అయితే హనన్యా ప్రవక్త, యిర్మీయా ప్రవక్త మెడ మీదనుంచి ఆ కాడిని తీసి దాన్ని విరిచేశాడు.

11ప్రజలందరి ఎదుట హనన్యా ఇలా అన్నాడు. “యెహోవా ఇలా చెబుతున్నాడు, ‘రెండేళ్ళలో నేను బబులోను రాజు నెబుకద్నెజరు కాడిని రాజ్యాలన్నిటి మెడమీద నుంచి తొలగించి దానిని విరిచివేస్తాను.’” అప్పుడు యిర్మీయా ప్రవక్త తన దారిన వెళ్లిపోయాడు.

12హనన్యా, యిర్మీయా మెడ మీద ఉన్న కాడిని విరిచిన తరువాత యెహోవా దగ్గర నుంచి ఈ సందేశం యిర్మీయాకు వచ్చింది.

13“నువ్వు పోయి హనన్యాతో ఇలా చెప్పు, ‘యెహోవా ఇలా చెబుతున్నాడు, నువ్వు కొయ్య కాడిని విరిచావు గదా! దానికి బదులు ఇనుప కాడిని నేను చేయిస్తాను.’

14ఇశ్రాయేలు దేవుడు సేనల ప్రభువు యెహోవా ఇలా చెబుతున్నాడు. ‘ఈ ప్రజలంతా బబులోను రాజు నెబుకద్నెజరుకు సేవ చేయాలని వారి మెడ మీద ఇనుప కాడి ఉంచాను. కాబట్టి వాళ్ళు అతనికి సేవ చేస్తారు. భూజంతువులను కూడా నేను అతనికి అప్పగించాను.’”

15అప్పుడు యిర్మీయా ప్రవక్త, హనన్యాతో ఇలా అన్నాడు. “హనన్యా, విను. యెహోవా నిన్ను పంపలేదు, ఈ ప్రజల చేత అబద్ధాలను నమ్మించావు.

16కాబట్టి యెహోవా ఈ మాట చెబుతున్నాడు, ‘నేను నిన్ను భూమి మీద లేకుండా చేయబోతున్నాను. యెహోవా మీద నమ్మకం ఉంచకుండా చేయడానికి నువ్వు ప్రజలను ప్రేరేపించావు. కాబట్టి ఈ సంవత్సరమే నువ్వు చనిపోతావు’” అని చెప్పాడు.

17ఆ సంవత్సరం ఏడో నెలలో హనన్యా ప్రవక్త చనిపోయాడు.

← Jeremiah 27Read In The App, Free →Jeremiah 29 →

Study Jeremiah 28

KJVMatthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)Reina-Valera (Español)Bíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)

All Chapters

12345678910111213141516171819202122232425262728293031323334353637383940414243444546474849505152