Jeremiah · బైబిల్ (తెలుగు)

Jeremiah 35

1యోషీయా కొడుకూ, యూదా రాజు అయిన యెహోయాకీము రోజుల్లో యెహోవా వాక్కు యిర్మీయాతో ఇలా అన్నాడు,

2“నువ్వు రేకాబీయుల దగ్గరికి వెళ్లి, వాళ్ళతో మాట్లాడి, యెహోవా మందిరంలో ఉన్న గదుల్లో ఒకదానిలోకి వాళ్ళను తీసుకొచ్చి, తాగడానికి వాళ్లకు ద్రాక్షారసం ఇవ్వు.”

3కాబట్టి నేను, యిర్మీయా కొడుకూ, యజన్యా మనవడూ అయిన హబజ్జిన్యాను, అతని సోదరులను, అతని కొడుకులందరినీ అంటే రేకాబీయుల కుటుంబికులను తీసుకొచ్చాను.

4యెహోవా మందిరంలో దైవజనుడైన యిగ్దల్యా కొడుకు, హానాను కొడుకుల గదిలోకి వాళ్ళను తీసుకొచ్చాను. అది రాజుల గదికి దగ్గరలో ఉన్న ద్వారపాలకుడూ, షల్లూము కొడుకు అయిన మయశేయా గదికి పైగా ఉంది.

5నేను రేకాబీయుల ఎదుట ద్రాక్షా రసంతో నిండిన పాత్రలు, గిన్నెలు పెట్టి “ద్రాక్షా రసం తాగండి” అని వాళ్ళతో చెప్పాను.

6కాని వాళ్ళు “మా పితరుడైన రేకాబు కొడుకు యెహోనాదాబు, ‘మీరు గానీ మీ సంతానం గానీ ఎప్పుడూ ద్రాక్షారసం తాగకూడదు,’ అని మాకు ఆజ్ఞాపించాడు గనక, మేం ద్రాక్షారసం తాగం.

7ఇంకా, ‘మీరు ఇళ్ళు కట్టుకోవద్దు, విత్తనాలు చల్ల వద్దు, ద్రాక్షతోట నాటవద్దు, అది మీకు ఉండనే ఉండకూడదు, మీరు పరదేశులుగా ఉంటున్న దేశంలో దీర్ఘాయుష్మంతులయ్యేలా మీ రోజులన్నీ గుడారాల్లోనే మీరు నివాసం చెయ్యాలి,’ అని అతడు మాకు ఆజ్ఞాపించాడు.

8కాబట్టి మా పితరుడైన రేకాబు కొడుకు యెహోనాదాబు మాకు ఆజ్ఞాపించిన అన్ని విషయాల్లో అతని మాటను బట్టి మేము, మా భార్యలు, మా కొడుకులు, మా కూతుళ్ళు ద్రాక్షారసం తాగడం లేదు.

9మా తండ్రి అయిన యెహోనాదాబు మాకు ఆజ్ఞాపించిన దానికి మేము విధేయులం అయ్యేందుకు, మేము ఇళ్ళు కట్టుకుని వాటిలో నివాసం ఉండం. ద్రాక్ష తోటలు, పొలాలు, విత్తనాలు మా ఆస్తులుగా ఉండవు.

10గుడారాల్లోనే నివాసం ఉంటాం.

11కాని, బబులోను రాజైన నెబుకద్నెజరు ఈ దేశం మీద దాడి చేసినప్పుడు, ‘కల్దీయుల సైన్యం, సిరియనుల సైన్యం నుంచి మనం తప్పించుకుని యెరూషలేముకు వెళ్దాం రండి’ అని మేము చెప్పుకున్నాం కాబట్టి మేము యెరూషలేములో నివాసం ఉంటున్నాం” అని చెప్పారు.

12అప్పుడు యెహోవా వాక్కు యిర్మీయాతో ఇలా అన్నాడు. “ఇశ్రాయేలు దేవుడైన యెహోవా చెప్పేదేమంటే,

13నువ్వు వెళ్లి యూదా వాళ్ళకూ, యెరూషలేము నివాసులకూ ఈ మాట ప్రకటించు, ‘యెహోవా వాక్కు ఇదే, మీరు దిద్దుబాటుకు లోబడి నా మాటలు వినరా?’ ఇదే యెహోవా వాక్కు.

14‘ద్రాక్షారసం తాగొద్దు,’ అని రేకాబు కొడుకు యెహోనాదాబు తన కొడుకులకు ఆజ్ఞాపించిన మాటలు స్థిరంగా ఉన్నాయి, ఈ రోజు వరకూ తమ పితరుడి ఆజ్ఞకు విధేయులై వాళ్ళు ద్రాక్షారసం తాగడం లేదు. కాని, నేను ఉదయాన్నే లేచి మీతో ఎంతో శ్రద్ధగా మాట్లాడినా, మీరు నా మాట వినరు.

15ఉదయాన్నే లేచి ప్రవక్తలైన నా సేవకులందరినీ మీ దగ్గరికి పంపుతూ, ‘ప్రతివాడూ తన దుర్మార్గత విడిచి మంచి పనులు చేయాలి, అన్యదేవుళ్ళ వెంట పడకూడదు. వాటిని పూజించకూడదు. నేను మీకూ, మీ పితరులకూ ఇచ్చిన దేశానికి తిరిగి వచ్చి దానిలో నివాసం ఉండాలి’ అని నేను ప్రకటించాను గాని, మీరు పట్టించుకోలేదు. నా మాట వినలేదు.

16రేకాబు కొడుకు యెహోనాదాబు సంతానం తమ తండ్రి తమకిచ్చిన ఆజ్ఞను నెరవేర్చారు. కాని ఈ ప్రజలు నా మాట వినరు.

17కాబట్టి, ఇశ్రాయేలు దేవుడూ, సైన్యాలకు అధిపతి అయిన యెహోవా ఇలా అంటున్నాడు, ‘చూడు, నేను వాళ్ళతో మాట్లాడాను గాని వాళ్ళు వినలేదు. నేను వాళ్ళను పిలిచాను గాని వాళ్ళు పలకలేదు. గనుక యూదా, యెరూషలేము నివాసులందరి మీదకీ తీసుకొస్తానని నేను చెప్పిన కీడంతా వాళ్ళ మీదకి తీసుకురాబోతున్నాను.’”

18యిర్మీయా రేకాబీయులను చూసి ఇలా అన్నాడు. “ఇశ్రాయేలు దేవుడూ, సైన్యాలకు అధిపతీ అయిన యెహోవా ఇలా అంటున్నాడు, మీరు మీ తండ్రి అయిన యెహోనాదాబు ఆజ్ఞకు విధేయులై అతని విధులన్నిటినీ పాటించి, అతడు మీకు ఆజ్ఞాపించినవన్నీ చేస్తున్నారు.

19కాబట్టి, ఇశ్రాయేలు దేవుడూ, సైన్యాలకు అధిపతి అయిన యెహోవా చెప్పేదేమంటే, ‘నాకు సేవ చెయ్యడానికి, రేకాబు కొడుకు యెహోనాదాబు సంతతివాడు ఒకడు ఎప్పుడూ ఉంటాడు.’”

← Jeremiah 34Read In The App, Free →Jeremiah 36 →

Study Jeremiah 35

KJVMatthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)Reina-Valera (Español)Bíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)

All Chapters

12345678910111213141516171819202122232425262728293031323334353637383940414243444546474849505152