Jude · బైబిల్ (తెలుగు)

Jude 1

1తండ్రి అయిన దేవుని పిలుపును, ప్రేమను పొంది, యేసు క్రీస్తు ద్వారా భద్రంగా ఉన్నవారికి యేసు క్రీస్తు సేవకుడు, యాకోబు సోదరుడు అయిన యూదా రాస్తున్నది.

2దయ, శాంతి, ప్రేమ మీకు సమృద్ధిగా కలుగు గాక. 1 పత్రిక రాసిన సందర్భం-భ్రష్టత్వం

3ప్రియులారా, మనకందరికీ చెందిన రక్షణ గురించి మీకు రాయాలనే ఆసక్తి నాకు ఎక్కువగా ఉన్నా, పవిత్రులకు దేవుడు ఒక్కసారే అప్పగించిన విశ్వాసం నిమిత్తం పట్టుదలతో పోరాడాలని ప్రోత్సహిస్తూ, రాయవలసి వచ్చింది.

4ఎందుకంటే కొంతమంది దొంగచాటుగా వచ్చి దేవుని కృపను లైంగిక అవినీతికి వీలుగా మార్చి, మన ఏకైక యజమాని, ప్రభువైన క్రీస్తును నిరాకరిస్తున్నారు. వీళ్ళు భక్తిహీనులు, శిక్షకు పాత్రులని ముందే రాసి ఉంది. 1 భ్రష్టత్వం ఉదాహరణలు

5ఈ సంగతులు మీకు ముందే తెలుసు. అయినా కొన్ని సంగతులు మీకు గుర్తు చేయాలని ఆశిస్తున్నాను. ప్రభువు ఐగుప్తు నుండి ఒక జనాంగాన్ని రక్షించాడు. కానీ నమ్మనివారిని ఆయన ఆ తరువాత నాశనం చేశాడు.

6తమ స్థానం నిలుపుకోని దూతలు, తమకు ఏర్పరచిన నివాస స్థలాలను విడిచిపెట్టారు. దేవుడు వారిని చీకటిలో నిత్య సంకెళ్ళతో బంధించి మహా తీర్పు రోజు కోసం ఉంచాడు.

7అదే విధంగా, సొదొమ గొమొర్రా, వాటి చుట్టూ ఉన్న పట్టణాలవారు జారత్వానికీ, అసహజమైన లైంగిక కోరికలకూ తమను తాము అప్పగించుకున్నారు. వారు శాశ్వత అగ్నికి గురై శిక్ష అనుభవించి, ఉదాహరణగా నిలిచారు. 1 భ్రష్ట బోధకుల వర్ణన

8అదే విధంగా, కలలు కనే వీరు ఒక వైపు తమ శరీరాలను అపవిత్రం చేసుకుంటున్నారు. ప్రభుత్వాన్ని నిరాకరిస్తూ దేవుని మహిమ రూపులను గురించి చెడుగా చెబుతున్నారు.

9అయితే, ప్రధాన దూత మిఖాయేలు సైతానుతో వ్యతిరేకించి మోషే శరీరాన్ని గూర్చి వాదిస్తూ ఉన్నప్పుడు, అవమానకరంగా మాట్లాడలేదు, వాడిమీద నేరం మోపడానికి తెగించలేదు. “ప్రభువు నిన్ను గద్దించు గాక” అన్నాడు.

10కాని వీరు, తమకు అర్థం కాని వాటిని దూషిస్తారు. తెలివిలేని జంతువుల్లాగా ప్రకృతి సిద్ధంగా తెలుసుకోగలిగే వాటివల్లే తమను తాము నాశనం చేసుకుంటున్నారు.

11వీరికి బాధ! వీరు కయీను మార్గంలో నడుస్తున్నారు. జీతం కోసం బిలాము దోషంలో పడిపోయారు. కోరహు తిరుగుబాటులో నశించిపోయారు.

12వీరు సిగ్గు లేకుండా విందుల్లో మీతో భోజనం చేస్తూ, తమను తాము బాగా పోషించుకుంటూ, నీటిలో దాగిన బండల్లా ఉన్నారు. వీరు గాలిలో ఎగిరే నీళ్ళులేని మేఘాలు. ఆకు రాలే కాలంలో పళ్ళు లేకుండా రెండు సార్లు చచ్చి వేళ్ళతో సహా పెళ్ళగించిన చెట్లలాంటివారు.

13సముద్రంలోని అలల నురగలాగా వారి సొంత అవమానం ఉంటుంది. వీరు దిక్కు తెలియక తిరుగుతున్న చుక్కల్లా ఉన్నారు. శాశ్వత గాడాంధకారం వారికోసం సిద్ధంగా ఉంది.

14ఆదాము నుండి ఏడవవాడైన హనోకు కూడా వీరిని గూర్చి ప్రవచిస్తూ ఇలా అన్నాడు. “వినండి, ప్రభువు వేవేలమంది పవిత్రులతో కలిసి వస్తున్నాడు.

15వారిలో భక్తి లేనివారు భక్తిహీన మార్గంలో చేసిన భక్తిహీన కార్యాలన్నిటి గురించీ నేరం రుజువు చేయడానికి, భక్తిలేని పాపులు తనకు వ్యతిరేకంగా చెప్పిన కఠినమైన మాటలన్నిటి గురించీ అందరికీ తీర్పు తీర్చడానికి ఆయన వస్తున్నాడు.”

16వారు తమ దురాశలను బట్టి నడచుకుంటూ, లాభం కోసం మనుషులను పొగుడుతూ, తమకు ఉన్న స్థితిని బట్టి సణుగుతూ, ఫిర్యాదులు చేస్తూ ఉంటారు.

17కాని ప్రియులారా, అంతకు ముందు మన ప్రభువైన యేసు క్రీస్తు అపొస్తలులు పలికిన మాటలను గుర్తు చేసుకోండి.

18చివరి కాలంలో భక్తిలేని తమ ఆశలననుసరించి నడుచుకొంటూ ఉండే పరిహాసకులు ఉంటారు అని అపొస్తలులు మీతో చెప్పారు.

19వీరు సహజ సిద్ధంగా దైవాత్మ లేని వారు. ప్రకృతి సంబంధులు, భేదాలు కలిగించేవారు. 1 నిజ విశ్వాసులకు ఆదరణ, వారికున్న ఏడు బాధ్యతలు

20కాని ప్రియులారా, అతి పవిత్రమైన విశ్వాసంలో ఎదుగుతూ, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తూ

21మిమ్మల్ని మీరు దేవుని ప్రేమలో భద్రం చేసుకుంటూ శాశ్వత జీవానికి నడిపించే మన ప్రభువైన యేసు క్రీస్తు దయ కోసం ఎదురు చూడండి.

22అనుమానంతో ఉన్న కొంతమంది పట్ల దయగా ఉండండి.

23అగ్నిలో నుండి లాగినట్టు కొంతమందిని రక్షించండి. ఇంకొంత మందిపై భయంతో కూడిన దయ చూపండి. పాపంతో మలినమైన దుస్తులను సైతం మీరు అసహ్యించుకోండి.

24మీరు తడబడకుండా భద్రం చేయడానికి ఆయన తన మహిమగల సన్నిధి ఎదుట మహా గొప్ప ఆనందంలో మిమ్మల్ని మచ్చలేని వారుగా ఉంచగలవాడు.

25ఏకైక దేవుడైన మన రక్షకునికి మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా మహిమ, ఘనత, ఆధిపత్యం, శక్తి అప్పుడు, ఇప్పుడు, ఎల్లప్పుడూ కలుగు గాక. ఆమెన్.

← 3 John 1Read In The App, Free →Revelation 1 →

Study Jude 1

KJVMatthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeAlbert BarnesJohn WesleyJohn CalvinScofieldWilliam BurkittFamily Bible NotesGeneva Bible Notes (1599)Reina-Valera (Español)Bíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)

All Chapters

1