Judges · బైబిల్ (తెలుగు)

Judges 4

1ఏహూదు చనిపోయిన తరువాత ఇశ్రాయేలీయులు మళ్ళీ యెహోవా దృష్టికి దోషులయ్యారు గనక

2హాసోరులో ఏలే కనాను రాజైన యాబీను చేతికి ఆయన వాళ్ళను అప్పగించాడు. అతని సేనాధిపతి పేరు సీసెరా. అతడు యూదేతరుల ప్రాంతం హరోషెతులో ఉంటున్నాడు.

3అతనికి తొమ్మిది వందల ఇనుప రథాలు ఉన్నాయి. అతడు ఇరవై సంవత్సరాలు ఇశ్రాయేలీయులను కఠినంగా హింసలపాలు చేసినప్పుడు ఇశ్రాయేలీయులు యెహోవాకు మొర్రపెట్టారు.

4ఆ రోజుల్లో లప్పీదోతు భార్య దెబోరా అనే ప్రవక్త్రి ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉండేది.

5ఆమె ఎఫ్రాయిమీయుల ఎడారిలో రమాకు బేతేలుకు మధ్య ఉన్న దెబోరా ఖర్జూర చెట్టు కింద తీర్పులు తీర్చడానికి కూర్చుని ఉండేది. తమ వివాదాలు పరిష్కరించుకోడానికి ఇశ్రాయేలీయులు ఆమె దగ్గరికి వస్తూ ఉండేవాళ్ళు.

6ఆమె నఫ్తాలిలోని కెదెషులో నుంచి అబీనోయము కొడుకు బారాకును పిలిపించి అతనితో ఇలా అంది “ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపిస్తున్నాడు, ‘నువ్వు వెళ్లి నఫ్తాలీయుల్లో, జెబూలూనీయుల్లో పదివేల మందిని తాబోరు కొండ దగ్గరికి రప్పించు.

7యాబీను సేనాధిపతి సీసెరాను, అతని రథాలను, అతని సైన్యాన్ని, కీషోను నది దగ్గర చేర్చి, అక్కడ అతని మీద నీకు జయం అనుగ్రహిస్తాను.’”

8అప్పుడు బారాకు “నువ్వు నాతోబాటు వస్తేనే వెళ్తాను గాని నువ్వు నాతో రాకపోతే నేను వెళ్లను” అని ఆమెతో చెప్పాడు.

9అప్పుడు ఆమె “నీతో నేను తప్పకుండా వస్తాను. అయితే, నువ్వు చేసే ఈ ప్రయాణంవల్ల నీకు ఘనత దొరకదు. ఒక స్త్రీ చాకచక్యం వలన యెహోవా సీసెరాను అప్పగిస్తాడు” అని చెప్పి, లేచి బారాకుతోబాటు కెదెషుకు వెళ్ళింది.

10బారాకు జెబూలూనీయులను, నఫ్తాలీయులను కెదెషుకు పిలిపించినప్పుడు పదివేలమంది మనుషులు అతనితో వెళ్ళారు.

11దెబోరా కూడా అతనితో వెళ్ళింది. ఈలోపు కయీనీయుడైన హెబెరు మోషే మామ హోబాబు సంతానం వారైన కయీనీయుల నుంచి వేరుపడి కెదెషు దగ్గర ఉన్న జయనన్నీములో ఉన్న మస్తకి చెట్టు దగ్గర తన గుడారం వేసుకుని ఉన్నాడు.

12అబీనోయము కొడుకైన బారాకు తాబోరు కొండపైకి వెళ్ళాడని సీసెరాకు తెలిసినప్పుడు సీసెరా తన రథాలన్నిటినీ, తన తొమ్మిదివందల ఇనుప రథాలను

13యూదేతరుల ప్రాంతమైన హరోషెతు నుంచి కీషోను నది వరకూ తన పక్షంగా ఉన్న ప్రజలందరినీ పిలిపించినప్పుడు

14దెబోరా “వెళ్ళు. యెహోవా సీసెరా మీద నీకు జయం ఇచ్చిన రోజు ఇదే. యెహోవా నిన్ను నడిపిస్తున్నాడు కదా” అని బారాకుతో చెప్పినప్పుడు, బారాకు ఆ పదివేలమంది మనుషులను వెంటబెట్టుకుని తాబోరు కొండ మీదినుంచి దిగి వచ్చాడు.

15బారాకు వాళ్ళను చంపడానికి వీలుగా యెహోవా సీసెరాను, అతని రథాలన్నిటినీ, అతని సైనికులను కలవరపరచినప్పుడు, సీసెరా తన రథం దిగి కాలినడకన పారిపోయాడు.

16బారాకు, ఆ రథాలను, సైన్యాన్ని యూదేతరుల ప్రాంతం హరోషెతు వరకూ తరిమినప్పుడు సీసెరా సైన్యమంతా కత్తివాత చేత కూలిపోయింది. ఒక్కడు కూడా బ్రతకలేదు.

17హాసోరు రాజు యాబీనుకూ కయీనీయుడైన హెబెరు వంశస్థులకూ సంధి ఒప్పందం ఉంది గనుక సీసెరా కాలినడకన కయీనీయుడైన హెబెరు భార్య యాయేలు గుడారానికి పారిపోయాడు.

18అప్పుడు యాయేలు సీసెరాను ఎదుర్కొని అతణ్ణి చూసి “ప్రభూ, ఇటు నా వైపుకి రండి, భయపడవద్దు” అని చెప్పింది. అప్పుడు అతడు ఆమె గుడారంలోకి వెళ్ళాడు.

19అప్పుడు ఆమె అతనిపై దుప్పటి కప్పింది. అతడు “దాహంగా ఉంది, దయచేసి నాకు కొంచెం నీళ్ళు ఇవ్వు” అని అడిగాడు. ఆమె తోలుతో చేసిన తిత్తి విప్పి అతనికి దాహానికి ఇచ్చి, అతనికి మళ్ళీ దుప్పటి కప్పే సమయంలో

20అతడు “గుడారం ద్వారం దగ్గర నుండి ఎవరైనా లోపలికి వచ్చి, లోపల ఎవరైనా ఉన్నారా అని అడిగితే, ఎవరూ లేరని నువ్వు చెప్పాలి” అన్నాడు.

21ఆ తరువాత హెబెరు భార్య యాయేలు గుడారానికి కొట్టే మేకు తీసుకుని ఒక సుత్తె చేత్తో పట్టుకుని మెల్లగా అతని దగ్గరికి వచ్చి, అలసిపోయి గాఢనిద్రలో ఉన్న అతని కణతలో ఆ మేకు దిగగొట్టగా అది అతని తలలో గుండా నేలలోకి దిగింది.

22అతడు చచ్చాడు. బారాకు సీసెరాను తరుముకుంటూ రాగా యాయేలు అతన్ని ఎదుర్కొని “నువ్వు వెతుకుతున్న మనిషిని నీకు చూపిస్తాను” అంది. అతడు వచ్చినప్పుడు సీసెరా చచ్చి పడి ఉన్నాడు. ఆ మేకు అతని కణతలో ఉంది.

23ఆ రోజు దేవుడు ఇశ్రాయేలీయుల కోసం కనాను రాజు యాబీనును ఓడించాడు

24తరువాత ఇశ్రాయేలీయుల కనాను రాజు యాబీనును చంపేవరకూ వారి బలం అంతకంతకూ పెరుగుతూ ఉంది.

← Judges 3Read In The App, Free →Judges 5 →

Study Judges 4

KJVMatthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)Reina-Valera (Español)Bíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)

All Chapters

123456789101112131415161718192021