Luke · బైబిల్ (తెలుగు)

Luke 13

1కొందరు గలిలయ ప్రజలు ఆలయంలో బలులర్పిస్తుంటే పిలాతు తన సైనికులను పంపి వారిని క్రూరంగా చంపించాడు. కొద్ది కాలం క్రితమే జరిగిన ఈ సంగతిని కొందరు యేసుకు తెలియజేశారు.

2అప్పుడు ఆయన వారితో ఇలా అన్నాడు, “ఈ గలిలయులు ఇలా దారుణంగా చనిపోయారు కాబట్టి వీళ్ళు మిగిలిన గలిలయుల కంటే పాపులని మీరు అనుకుంటున్నారా?

3కారని మీతో చెబుతున్నాను. మీరు మారుమనస్సు పొందకపోతే మీరు కూడా అలాగే నశిస్తారు.

4అలాగే సిలోయంలో గోపురం కింద పడి చనిపోయిన పద్దెనిమిది మంది సంగతేంటి? వారు యెరూషలేములో నివాసమున్న వారందరి కంటే అపరాధులని అనుకుంటున్నారా?

5కానే కాదని మీతో చెబుతున్నా. మీరు మారుమనస్సు పొందకపోతే మీరు కూడా అలాగే నశిస్తారు.” 1 పండ్లు లేని అంజూరు చెట్టు (యెషయా 5:1-7. మత్తయి 21:18-20)

6తరవాత ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాడు, “ఒక మనిషి తన ద్రాక్షతోటలో ఒక అంజూరు చెట్టు నాటాడు. అతడు దాని పండ్లు వెదకడానికి వచ్చి చూస్తే అతనికి పండ్లేమీ కనిపించలేదు.

7దాంతో అతడు తోటమాలిని పిలిచి అతనితో, ‘మూడేళ్ళ నుండి నేను ఈ అంజూరు చెట్టు పండ్ల కోసం వస్తున్నాను గానీ నాకేమీ దొరకడం లేదు. దీన్ని నరికెయ్యి. దీని వల్ల భూమి కూడా ఎందుకు వృధా కావాలి’ అన్నాడు.

8అయితే ఆ తోటమాలి, ‘అయ్యా, నేను దాని చుట్టూ తవ్వి, ఎరువు వేస్తాను. అందుకని ఈ సంవత్సరం కూడా దీన్ని ఉండనియ్యి,

9అది ఫలిస్తే సరే, లేకపోతే నరికించి వెయ్యి’ అన్నాడు.” 1 ఒక స్త్రీకి స్వస్థత

10ఒక విశ్రాంతి దినం ఆయన ఒక సమాజ మందిరంలో బోధిస్తున్నాడు.

11బలహీనపరచే దయ్యం పట్టిన ఒక స్త్రీ పద్దెనిమిది ఏళ్ళుగా అక్కడ ఉంది. ఆమె నడుం వంగిపోయి ఎంత మాత్రమూ సరిగ్గా నిలబడలేక పోతూ ఉంది.

12యేసు ఆమెను చూసి, తన దగ్గరికి రమ్మని పిలిచి, “అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొందావు” అని ఆమెతో చెప్పి

13ఆమె మీద చేతులుంచాడు. వెంటనే ఆమె చక్కగా నిలబడి దేవుణ్ణి మహిమ పరిచింది.

14యేసు విశ్రాంతి దినాన స్వస్థపరచాడని ఆ సమాజ మందిరం అధికారి మండిపడ్డాడు. అతడు జనసమూహాన్ని చూసి, “పని చేయడానికి ఆరు రోజులున్నాయి కదా, ఆ రోజుల్లోనే వచ్చి స్వస్థత పొందండి. విశ్రాంతి దినం మాత్రం రావద్దు” అని చెప్పాడు.

15అందుకు ప్రభువు, “కపటులారా, మీలో ప్రతివాడూ విశ్రాంతిదినాన తన ఎద్దునైనా గాడిద నైనా గాడి దగ్గరనుంచి విప్పి, తోలుకుపోయి నీళ్ళు పెడతాడా లేదా.

16ఇదిగో, పద్దెనిమిది ఏళ్ళ నుండి సాతాను బంధించిన అబ్రాహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినాన ఈ బంధకాల నుండి విడిపించకూడదా?” అన్నాడు.

17ఆయన ఈ మాటలు అన్నప్పుడు ఆయనను ఎదిరించిన వారంతా సిగ్గుపడ్డారు. అయితే జనసమూహమంతా ఆయన చేసిన గొప్ప కార్యాలను చూసి సంతోషించారు. 1 ఆవగింజ ఉపమానం మత్తయి 13:31, 32; మార్కు 4:30-32

18ఆయన ఇలా అన్నాడు, “దేవుని రాజ్యం ఎలా ఉంటుంది? దాన్ని దేనితో పోల్చగలం?

19అది ఒక వ్యక్తి తన తోటలో వేసిన ఆవగింజ లాగా ఉంది. అది పెరిగి పెద్ద చెట్టు అయింది. ఆకాశంలోని పక్షులు దాని కొమ్మలపై నివసించాయి.” 1 పొంగజేసే పదార్థం ఉపమానం మత్తయి 13:33

20మళ్ళీ ఆయన, “దేవుని రాజ్యాన్ని దేనితో పోల్చగలం?

21ఒక స్త్రీ మూడు కుంచాల పిండి పొంగడానికి, దానిలో వేసే పుల్లని పిండిలాగా ఉంది” అన్నాడు. 1 యెరూషలేము మార్గంలో బోధనలు

22ఆయన యెరూషలేముకు ప్రయాణమై దారిలోని పట్టణాల్లో గ్రామాల్లో సంచరించి ప్రజలకు బోధించాడు.

23ఒకడు, “ప్రభూ, రక్షణ పొందేది కొద్ది మందేనా?” అని ఆయనను అడిగాడు.

24దానికి ప్రభువు ఇలా జవాబిచ్చాడు, “ఇరుకు ద్వారం గుండా ప్రవేశించడానికి తీవ్ర ప్రయత్నం చెయ్యండి. చాలా మంది ప్రవేశించడానికి ప్రయత్నిస్తారుగానీ వారి వల్ల కాదని చెబుతున్నాను.

25ఇంటి యజమాని తలుపు వేసుకున్న తరువాత మీరు బయట నిలబడి తలుపు కొడుతూ, ‘అయ్యా, దయచేసి తలుపు తెరవండి’ అని ప్రార్థిస్తే

26ఆయన, ‘మీరు ఎవరో, ఎక్కడి వారో నాకు తెలియదు’ అని మీతో అంటాడు. అప్పుడు మీరు, ‘నీ ఎదుటనే మేము తిన్నాం, తాగాం, మా వీధుల్లో నువ్వు ప్రచారం చేశావు కదా’ అంటారు.

27అప్పుడు ఆయన, ‘మళ్ళీ చెబుతున్నా, మీరు ఎక్కడి వారో నాకు తెలియదు. మీరంతా అక్రమాలు చేసేవారు. నా దగ్గరనుంచి పొండి’ అంటాడు.

28అబ్రాహాము ఇస్సాకు యాకోబు, ప్రవక్తలందరూ దేవుని రాజ్యంలో ఉండటం, మిమ్మల్ని బయటకు తోసివేయడం చూసి మీరు ఏడుస్తూ పండ్లు కొరుకుతారు.

29ఇంకా ప్రజలు తూర్పు నుండీ పడమర నుండీ ఉత్తరం నుండీ దక్షిణం నుండీ వచ్చి, దేవుని రాజ్యంలో భోజనానికి కూర్చుంటారు.

30ఇదిగో వినండి, చివరి వారు మొదటి వారవుతారు, అలాగే మొదటివారు చివరి వారవుతారు.”

31అదే రోజున కొందరు పరిసయ్యులు వచ్చి, “నువ్వు ఇక్కడినుంచి వెంటనే వెళ్ళిపో. ఎందుకంటే హేరోదు నిన్ను చంపాలని చూస్తున్నాడు” అని ఆయనతో చెప్పారు.

32ఆయన వారిని చూసి, “మీరు వెళ్ళి, ఆ గుంట నక్కతో ఇలా చెప్పండి, ఇదిగో ఈ రోజూ, రేపూ నేను దయ్యాలను వెళ్ళగొడతాను. రోగులను స్వస్థ పరుస్తాను. మూడవ రోజున నా గమ్యం నేను చేరుకుంటాను.

33అయితే ఈ రోజూ రేపూ ఆ తరువాత కూడా నేను యెరూషలేముకు నా ప్రయాణం కొనసాగించాల్సిందే. ఎందుకంటే యెరూషలేముకు బయట ప్రవక్త హతం కావడం జరగదు. 1 యెరూషలేము కోసం యేసు విలాపం మత్తయి 23:37-39; లూకా 19:41-44

34“యెరూషలేమా, ఓ యెరూషలేమా, ప్రవక్తలను చంపుతూ నీ దగ్గరికి పంపిన వారిని రాళ్ళతో కొడుతూ ఉండే పట్టణమా, కోడి తన పిల్లలను రెక్కల కింద ఎలా చేర్చుకుంటుందో ఆలాగే నేను నీ పిల్లలను చేర్చుకోవాలని ఎన్నోసార్లు ఇష్టపడ్డాను. కాని నువ్వు కలిసి రాలేదు.

35ఇదిగో విను! నీ ఇల్లు నీకు పాడుగా విడిచి పెడుతున్నాను. ‘ప్రభువు పేరిట వచ్చే వాడు ధన్యుడు’ అని నువ్వు చెప్పేంతవరకూ నన్ను మళ్ళీ చూడవని నీతో కచ్చితంగా చెబుతున్నాను,” అన్నాడు.

← Luke 12Read In The App, Free →Luke 14 →

Study Luke 13

KJVMatthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeAlbert BarnesJohn WesleyJohn CalvinScofieldWilliam BurkittFamily Bible NotesThe Fourfold GospelJohn LightfootGeneva Bible Notes (1599)Reina-Valera (Español)Bíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)

All Chapters

123456789101112131415161718192021222324