Deuteronomy · బైబిల్ (తెలుగు)

Deuteronomy 24

1“ఎవరైనా ఒక స్త్రీని పెళ్ళి చేసుకుని, ఆ తరువాత ఆమె ఇంతకు ముందే పరాయి పురుషునితో లైంగికంగా సంబంధం కలిగి ఉన్నట్టు అనుమానం కలిగితే ఆమెపై అతనికి ఇష్టం తొలగిపోతే అతడు ఆమెకు విడాకులు రాయించి ఆమె చేతికిచ్చి తన ఇంట్లోనుంచి ఆమెను పంపేయాలి.

2ఆమె అతని దగ్గర నుండి వెళ్లిపోయిన తరువాత వేరొక పురుషుణ్ణి పెళ్లి చేసుకోవచ్చు.

3ఆ రెండోవాడు కూడా ఆమెను ఇష్టపడకుండా ఆమెకు విడాకులు రాయించి ఆమె చేతికిచ్చి తన ఇంటి నుంచి ఆమెను పంపి వేసినా, లేదా ఆమెను పెళ్ళిచేసుకున్న ఆ వ్యక్తి చనిపోయినా,

4ఆమెను తిరస్కరించిన ఆమె మొదటి భర్త ఆమెను తిరిగి పెళ్లి చేసుకోకూడదు. ఎందుకంటే ఆమె అపవిత్రురాలు. అది యెహోవాకు అసహ్యం. కాబట్టి మీ యెహోవా దేవుడు మీకు వారసత్వంగా ఇవ్వబోయే దేశానికి పాపం తెచ్చిపెట్టకూడదు.

5కొత్తగా పెళ్ళిచేసుకున్న వాళ్ళు సైన్యంలో చేరకూడదు. వాళ్లకు ఎలాంటి బాధ్యతలు అప్పగించకూడదు. ఒక సంవత్సరం పాటు అతడు కులాసాగా తన ఇంట్లో ఉంటూ పెళ్లి చేసుకున్న భార్యను సంతోషపెట్టాలి.

6తిరగలిని, తిరగటి పైరాతిని తాకట్టు పెట్టకూడదు. అలా చేస్తే ఒకడి జీవనాధారాన్ని తాకట్టు పెట్టినట్టే.

7ఒకడు ఇశ్రాయేలు ప్రజల్లోని తన సోదరుల్లో ఎవరినైనా బలాత్కారంగా ఎత్తుకుపోయి అతణ్ణి తన బానిసగా చేసుకున్నా, లేదా అమ్మివేసినా అతణ్ణి చంపివేయాలి. అలా చేస్తే ఆ చెడుతనాన్ని మీ మధ్యనుంచి రూపుమాపిన వారవుతారు.

8కుష్టురోగం విషయంలో యాజకులైన లేవీయులు మీకు బోధించే దాన్నంతా చేసే విషయంలో జాగ్రత్త వహించండి. ఈ విషయంలో నేను వారికి ఆజ్ఞాపించినదంతా జాగ్రత్తగా జరిగించండి.

9మీరు ఐగుప్తు నుంచి వస్తున్నప్పుడు దారిలో మీ దేవుడైన యెహోవా మిర్యాముకు చేసిన దాన్ని గుర్తుంచుకోండి.

10మీ పొరుగువాడికి ఏదైనా అప్పు ఇచ్చినప్పుడు అతని దగ్గర తాకట్టు వస్తువు తీసుకొనేందుకు అతని ఇంటి లోపలికి వెళ్లకూడదు.

11ఇంటి బయటే నిలబడాలి. అప్పు తీసుకునేవాడు బయట నిలబడి ఉన్న నీ దగ్గరికి ఆ తాకట్టు వస్తువు తీసుకు వస్తాడు.

12అతడు పేదవాడైన పక్షంలో నువ్వు అతని తాకట్టు వస్తువు నీదగ్గరే ఉంచుకుని నిద్రపోకూడదు. అతడు తన దుప్పటి కప్పుకుని నిద్రబోయేముందు నిన్ను దీవించేలా సూర్యాస్తమయంలోగా తప్పకుండా ఆ తాకట్టు వస్తువును అతనికి తిరిగి అప్పగించాలి.

13అది మీ యెహోవా దేవుని దృష్టిలో మీకు నీతి అవుతుంది.

14మీ సోదరుల్లో గానీ మీ దేశంలోని గ్రామాల్లో ఉన్న విదేశీయుల్లోగానీ దరిద్రులైన కూలివారిని బాధించకూడదు. ఏ రోజు కూలి ఆ రోజే ఇవ్వాలి.

15సూర్యుడు అస్తమించేలోగా అతనికి కూలి చెల్లించాలి. అతడు పేదవాడు కాబట్టి అతనికి వచ్చే సొమ్ము మీద ఆశ పెట్టుకుంటాడు. వాడు నిన్ను బట్టి యెహోవాకు మొర్ర పెడతాడేమో. అది నీకు పాపమవుతుంది.

16కొడుకుల పాపాన్నిబట్టి తండ్రులకు మరణశిక్ష విధించకూడదు, తండ్రుల పాపాన్ని బట్టి కొడుకులకు మరణశిక్ష విధించకూడదు. ఎవరి పాపానికి వారే మరణశిక్ష పొందాలి.

17పరదేశులకు గానీ తండ్రి లేనివారికి గానీ అన్యాయంగా తీర్పు తీర్చకూడదు. విధవరాలి దుస్తులు తాకట్టుగా తీసుకోకూడదు.

18మీరు ఐగుప్తులో బానిసలుగా ఉండగా మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని అక్కడనుంచి విమోచించాడని గుర్తుచేసుకోవాలి. అందుకే ఈ పనులు చెయ్యాలని మీకు ఆజ్ఞాపిస్తున్నాను.

19మీ పొలంలో మీ పంట కోస్తున్నప్పుడు పొలంలో ఒక పన మర్చిపోతే దాన్ని తెచ్చుకోడానికి మీరు తిరిగి వెనక్కి వెళ్ళకూడదు. మీ దేవుడైన యెహోవా మీరు చేసే పనులన్నిటిలో మిమ్మల్ని ఆశీర్వదించేలా అది పరదేశులకు, తండ్రి లేనివారికీ, విధవరాళ్లకూ మిగల్చాలి.

20మీ ఒలీవ పండ్లను ఏరుకునేటప్పుడు మీ వెనక ఉన్న పరిగెను ఏరుకోకూడదు. అవి పరదేశులకు, తండ్రి లేనివారికీ, విధవరాళ్లకూ మిగల్చాలి.

21మీ ద్రాక్షపండ్లను కోసుకొనేటప్పుడు మీ వెనకపడిపోయిన గుత్తిని ఏరుకోకూడదు. అది పరదేశులకు, తండ్రి లేనివారికీ, విధవరాళ్లకూ మిగల్చాలి.

22మీరు ఐగుప్తు దేశంలో బానిసగా ఉన్నారని గుర్తుచేసుకోండి. అందుకే ఈ పని చెయ్యాలని మీకు ఆజ్ఞాపిస్తున్నాను.”

← Deuteronomy 23Read In The App, Free →Deuteronomy 25 →

Study Deuteronomy 24

KJVMatthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)Reina-Valera (Español)Bíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)

All Chapters

12345678910111213141516171819202122232425262728293031323334