Deuteronomy · బైబిల్ (తెలుగు)

Deuteronomy 30

1“నేను మీకు తెలియపరచిన ఈ విషయాలన్నీ అంటే దీవెనలు, శాపాలు మీ మీదికి వచ్చిన తరువాత మీ దేవుడు మిమ్మల్ని వెళ్లగొట్టించిన

2అన్ని రాజ్యాల్లో వాటిని గుర్తుకు తెచ్చుకుంటారు. అప్పుడు మీరూ, మీ పిల్లలూ మీ దేవుడైన యెహోవా వైపు తిరిగితే, ఈవేళ నేను మీకాజ్ఞాపించే వాటి ప్రకారం మీరు హృదయపూర్వకంగా సంపూర్ణ ఆత్మతో ఆయన మాట వింటే

3మీ దేవుడైన యెహోవా చెరలో ఉన్న మిమ్మల్ని మళ్ళీ రప్పిస్తాడు. ఆయన మిమ్మల్ని కనికరించి, మీ యెహోవా దేవుడు ఏ ప్రజల్లోకి మిమ్మల్ని చెదరగొట్టాడో వారందరిలో నుంచి మిమ్మల్ని సమకూర్చి ఇక్కడికి తీసుకువస్తాడు.

4చెదిరిపోయిన మీలో ఎవరైనా భూమి దిగంతాల్లో ఉన్నప్పటికీ అక్కడ నుంచి మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని సమకూర్చి అక్కడ నుంచి తీసుకు వస్తాడు.

5మీ పూర్వీకులు స్వాధీనం చేసుకున్న దేశానికి మీ యెహోవా దేవుడు మిమ్మల్ని చేరుస్తాడు. మీరు దాన్ని స్వాధీనం చేసుకుంటారు. ఆయన మీకు మేలు చేసి మీ పూర్వీకుల కంటే మిమ్మల్ని అసంఖ్యాకంగా చేస్తాడు.

6మీరు బతకడానికి, హృదయపూర్వకంగా సంపూర్ణ ఆత్మతో మీ యెహోవా దేవుని ప్రేమించేలా మీ యెహోవా దేవుడు మీ హృదయానికీ మీ పిల్లల హృదయానికీ సున్నతి చేస్తాడు.

7మిమ్మల్ని హింసించిన మీ శత్రువుల మీదికీ మిమ్మల్ని ద్వేషించినవారి మీదికీ మీ యెహోవా దేవుడు ఆ శాపాలన్నీ రప్పిస్తాడు.

8మీరు తిరిగి వచ్చి యెహోవా మాట వింటారు. నేనిప్పుడు మీకాజ్ఞాపించే ఆయన ఆజ్ఞలన్నిటి ప్రకారం ప్రవర్తిస్తారు.

9మీ యెహోవా దేవుడు, మీరు చేతులతో చేసే పనులన్నిటిలో, మీ గర్భఫలం విషయంలో మీ పశువుల గర్భఫలం విషయంలో మీ భూపంట విషయంలో మీకు అభివృద్ధి కలిగిస్తాడు.

10ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో రాసిన ఆయన ఆజ్ఞలనూ, చట్టాలనూ మీరు పాటిస్తే మీ యెహోవా దేవుని మాట విని, మీ హృదయపూర్వకంగా సంపూర్ణ ఆత్మతో మీ యెహోవా దేవుని వైపు తిరిగితే, యెహోవా మీ పూర్వీకుల గురించి సంతోషించినట్టు మీకు మేలు చేయడానికి మీపట్ల మళ్ళీ సంతోషిస్తాడు.

11ఇవ్వాళ నేను మీకు ఆజ్ఞాపించే ఈ విధులు గ్రహించడం మీకు కష్టం కాదు, వాటిని అందుకోవడం అసాధ్యమూ కాదు.

12‘మనం విని, దాని ప్రకారం చేయడం కోసం పరలోకానికి ఎక్కిపోయి మన దగ్గరికి దాన్ని ఎవరు తెస్తారు?’ అని మీరు భావించడానికి అది ఆకాశంలో ఉండేది కాదు.

13‘మనం విని, దాని ప్రకారం చేయడానికి సముద్రం దాటి మన దగ్గరికి దాన్ని ఎవరు తెస్తారు?’ అని భావించడానికి అది సముద్రం అవతల ఉండేదీ కాదు.

14మీరు దాని ప్రకారం చేయడానికి ఆ మాట మీకు చాలా సమీపంగా ఉంది. అది మీ నోటి వెంట, మీ హృదయంలో ఉంది.

15చూడండి, ఈరోజు నేను జీవాన్నీ మేలునూ, చావునూ కీడునూ మీ ఎదుట ఉంచాను.

16మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గాల్లో నడుస్తూ ఆయన ఆజ్ఞలూ చట్టాలూ విధులూ ఆచరించమని నేను మిమ్మల్ని ఆజ్ఞాపిస్తున్నాను. అలా చేస్తే మీరు స్వాధీనం చేసుకోడానికి ప్రవేశించే దేశంలో మీ యెహోవా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు.

17అయితే మీ హృదయం వేరొక వైపుకు మళ్ళి, మాటకు లోబడక అన్య దేవుళ్ళకు మొక్కి, పూజిస్తే

18మీరు తప్పకుండా నాశనమైపోతారని, స్వాధీనం చేసుకోడానికి యొర్దాను నది దాటిపోతున్న దేశంలో మీరు శాశ్వితకాలం జీవించరనీ తెలియచేస్తున్నాను.

19ఈరోజు జీవాన్నీ చావునూ ఆశీర్వాదాన్నీ శాపాన్నీ నేను మీ ఎదుట ఉంచుతున్నాను. భూమినీ, ఆకాశాన్నీ మీ మీద సాక్షులుగా పిలుస్తున్నాను.

20మీ పితరులు అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు ఆయన ప్రమాణం చేసిన దేశంలో మీరు నివసించడానికి యెహోవాయే మీ ప్రాణానికీ మీ దీర్ఘాయుష్షుకూ మూలం. కాబట్టి మీరూ మీ సంతానం జీవిస్తూ మీ జీవానికి మూలమైన మీ యెహోవా దేవుణ్ణి ప్రేమించి ఆయన ఉపదేశం విని ఆయనను హత్తుకుని ఉండేలా జీవాన్ని కోరుకోండి.”

← Deuteronomy 29Read In The App, Free →Deuteronomy 31 →

Study Deuteronomy 30

KJVMatthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)Reina-Valera (Español)Bíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)

All Chapters

12345678910111213141516171819202122232425262728293031323334