Job 22
1అప్పుడు తేమాను వాడు ఎలీఫజు ఇలా జవాబిచ్చాడు. 1
2మానవమాత్రులు దేవునికి ప్రయోజనకారులౌతారా? కారు. బుద్ధిమంతులు తమ మట్టుకు తామే ప్రయోజనకారులు. 1
3నువ్వు నీతిమంతుడివై ఉండడం సర్వశక్తుడైన దేవునికి సంతోషమా? నువ్వు యథార్థవంతుడివై ప్రవర్తించడం ఆయనకు లాభకరమా? 1
4ఆయన పట్ల భయభక్తులు కలిగి ఉన్నందువల్ల ఆయన నిన్ను గద్దిస్తాడా? నీ భయభక్తులను బట్టి ఆయన నీతో వ్యాజ్యెమాడుతాడా? 1
5నీ చెడుతనం గొప్పది కాదా? నీ దోషాలు మితి లేనివి కావా? 1
6ఏమీ ఇవ్వకుండానే నీ సోదరుల దగ్గర నువ్వు తాకట్టు పెట్టుకున్నావు. వస్త్ర హీనుల బట్టలు తీసుకున్నావు. 1
7దాహంతో సొమ్మసిల్లిన వారికి నీళ్లియ్యలేదు. ఆకలిగొన్న వాడికి అన్నం పెట్టలేదు. 1
8బాహుబలం గల వాడికే భూమి లభిస్తుంది. గొప్పవాడు అనిపించుకున్న వాడు దానిలో నివసిస్తాడు. 1
9వితంతువులను వట్టి చేతులతో పంపివేశావు. తండ్రి లేనివారి చేతులు విరగ్గొట్టావు. 1
10అందుకే బోనులు నిన్ను చుట్టుముడుతున్నాయి. అకస్మాత్తుగా కలిగే భీతి నిన్ను హడలగొడుతున్నది. 1
11నిన్ను చిక్కించుకొన్న అంధకారాన్ని నువ్వు చూడడం లేదా? నిన్ను ముంచెత్తబోతున్న ప్రళయ జలాలను నువ్వు చూడడం లేదా? 1
12దేవుడు ఆకాశమంత మహోన్నతుడు కాడా? నక్షత్రాల ఔన్నత్యాన్ని చూడు. అవి ఎంత ఎత్తులో ఉన్నాయి! 1
13“దేవుడికి ఏమి తెలుసు? గాఢాంధకారంలోనుండి ఆయన న్యాయం కనుగొంటాడా? 1
14దట్టమైన మేఘాలు ఆయనకు అడ్డుగా ఉన్నాయి. ఆయన మనలను చూడలేడు. ఆకాశ గోపురంలో ఆయన తిరుగుతున్నాడు” అని నీవనుకుంటావు. 1
15పూర్వకాలం నుండి దుష్టులు అనుసరించిన మార్గాన్ని నువ్వు అనుసరిస్తావా? 1
16తమ కాలం రాకముందే వారు హటాత్తుగా నిర్మూలమైపోయారు. వారి పునాదులు నదీ ప్రవాహలవలె కొట్టుకు పోయాయి. 1
17“మా దగ్గర నుండి తొలగి పో” అని దేవునితో అంటారు. “సర్వశక్తుడు మాకు ఏమి చేస్తాడులే” అంటారు. 1
18అయినా ఆయన మంచి పదార్థాలతో వారి ఇళ్ళు నింపాడు. భక్తిహీనుల ఆలోచన నాకు దూరం అగు గాక. 1
19నీతిమంతులు దాన్ని చూసి సంతోషిస్తారు. నిర్దోషులు వారిని హేళన చేస్తారు. 1
20“మన విరోధులు నిశ్చయంగా నిర్మూలమైపోయారు. వారి సంపదను అగ్ని కాల్చివేసింది” అంటారు. 1
21ఆయనతో సహవాసం చేస్తే నీకు శాంతిసమాధానాలు కలుగుతాయి. ఆ విధంగా నీకు మేలు కలుగుతుంది. 1
22ఆయన నోటి నుండి వచ్చే ఉపదేశాన్ని అవలంబించు. ఆయన మాటలను నీ హృదయంలో ఉంచుకో. 1
23సర్వశక్తుని వైపు తిరిగి నీ నివాసాల్లో నుండి దుర్మార్గాన్ని దూరంగా తొలగిస్తే నువ్వు అభివృద్ధి పొందుతావు. 1
24మట్టిలో నీ సిరిసంపదలను, సెలయేటి నీటిలో ఓఫీరు బంగారాన్ని పారవెయ్యి. 1
25అప్పుడు సర్వశక్తుడు నీకు సువర్ణంగాను ప్రశస్తమైన వెండిగాను ఉంటాడు. 1
26అప్పుడు సర్వశక్తునిలో నువ్వు ఆనందిస్తావు. దేవుని వైపు నీ ముఖం ఎత్తుతావు. 1
27నువ్వు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకిస్తాడు. నీ మొక్కుబళ్లు నువ్వు చెల్లిస్తావు. 1
28నువ్వు దేనినైనా ఆలోచన చేస్తే అది నీకు స్థిరపడుతుంది. నీ మార్గాలపై వెలుగు ప్రకాశిస్తుంది. 1
29దేవుడు గర్విష్టులను వంచుతాడు. కళ్ళు దించుకునే వారిని కాపాడతాడు. 1
30నిర్దోషి కానివాడినైనా ఆయన విడిపిస్తాడు. అతడు నీ చేతుల శుద్ధి మూలంగా విడుదల పొందుతాడు.