Job 34
1అప్పుడు ఎలీహు మళ్ళీ ఇలా చెప్పసాగాడు. 1
2జ్ఞానులారా, నా మాటలు వినండి. అనుభవశాలులారా, వినండి. 1
3అంగిలి ఆహారాన్ని రుచి చూసినట్టు చెవి మాటలను పరీక్షిస్తుంది. 1
4న్యాయమైనదేదో విచారించి చూద్దాం రండి. మేలైనదేదో మనంతట మనం విచారించి తెలుసుకుందాము రండి. 1
5“నేను నీతిమంతుణ్ణి, దేవుడు నాకు అన్యాయం చేసాడు. 1
6నేను న్యాయవంతుడినైనా అబద్ధికునిగా చూస్తున్నారు. నేను తిరుగుబాటు చేయకపోయినా నాకు మానని గాయం కలిగింది” అని యోబు అంటున్నాడు. 1
7యోబులాంటి మానవుడెవరు? అతడు మంచి నీళ్లవలె తిరస్కారాన్ని పానం చేస్తున్నాడు. 1
8అతడు చెడుతనం చేసే వారికి మిత్రుడయ్యాడు. భక్తిహీనుల చెలికాడు అయ్యాడు. 1
9మనుషులు దేవునితో సహవాసం చేయడం వారికేమాత్రం ప్రయోజనకరం కాదని అతడు చెప్పుకుంటున్నాడు. 1
10విజ్ఞానం గల మనుషులారా, నా మాట ఆలకించండి దేవుడు అన్యాయం చేయడం అసంభవం. సర్వశక్తుడు దుష్కార్యం చేయడం అసంభవం. 1
11మనుషుల క్రియలకు తగినట్టుగా ఆయన వారికి ప్రతిఫలం ఇస్తాడు అందరికీ ఎవరి మార్గాలను బట్టి వారికి ఫలమిస్తాడు. 1
12దేవుడు ఏ మాత్రం దుష్కార్యం చేయడు. సర్వశక్తుడు న్యాయం తప్పడు. 1
13ఎవడైనా భూమిని ఆయనకు అప్పగింత పెట్టాడా? ఎవడైనా సర్వప్రపంచ భారాన్ని ఆయనకు అప్పగించాడా? 1
14ఆయన తన మనస్సు తన దగ్గరే ఉంచుకున్నట్టయితే, తన ఆత్మను, ఊపిరినీ తన దగ్గరికి తిరిగి తీసుకుంటే, 1
15శరీరులంతా ఒక్కపెట్టున నశిస్తారు. మనుషులు మళ్ళీ ధూళిగా మారిపోతారు. 1
16కాబట్టి దీన్ని విని వివేచించు, నా మాటలు ఆలకించు. 1
17న్యాయాన్ని ద్వేషించేవాడు లోకాన్ని ఏలుతాడా? న్యాయసంపన్నునిపై నేరం మోపుతావా? 1
18నువ్వు పనికిమాలిన వాడివని రాజుతోనైనా, మీరు దుష్టులని ప్రధానులతోనైనా అనవచ్చా? 1
19రాజుల పట్ల పక్షపాతం చూపని వాడితో పేదలకన్నా ధనికులను ఎక్కువగా చూడని వాడితో అలా పలకవచ్చా? వారందరూ ఆయన నిర్మించినవారు కారా? 1
20వారు నిమిషంలో చనిపోతారు. అర్థరాత్రి వేళ ప్రజలు కల్లోలం పాలై నాశనమౌతారు. బలవంతులను తీసుకు పోవడం జరుగుతుంది, అయితే అది మానవ హస్తాల వలన కాదు. 1
21ఆయన దృష్టి మనుషుల మార్గాల మీద ఉంది. ఆయన వారి నడకలన్నీ కనిపెట్టి చూస్తున్నాడు. 1
22చెడు కార్యాలు చేసే వారు దాక్కోడానికి చీకటైనా మరణాంధకారమైనా లేదు. 1
23ఒక మనిషిని న్యాయవిమర్శలోకి తీసుకు రాక ముందు అతణ్ణి ఎక్కువ కాలం విచారణ చేయడం దేవుడికి అవసరం లేదు. 1
24విచారణ లేకుండానే బలవంతులను ఆయన నిర్మూలం చేస్తున్నాడు. వారి స్థానంలో ఇతరులను నియమిస్తున్నాడు. 1
25వారి క్రియలను ఆయన తెలుసుకుంటున్నాడు. రాత్రివేళ ఇలాటి వారిని ఆయన కూలదోస్తాడు. వారు నాశనమై పోతారు. 1
26అందరూ చూస్తుండగానే దుష్టులను వారి దుర్మార్గాన్ని బట్టి నేరస్తులను శిక్షించినట్టు ఆయన శిక్షిస్తాడు. 1
27ఎందుకంటే వారు ఆయనను అనుసరించడం మానుకున్నారు. ఆయన ఆజ్ఞల్లో దేన్నీ లక్ష్య పెట్టలేదు. 1
28పేదల మొరను ఆయన దగ్గరికి వచ్చేలా చేశారు. దీనుల మొర ఆయనకు వినబడేలా చేశారు. 1
29ఆయన మౌనంగా ఉండిపోతే తీర్పు తీర్చగలవాడెవడు? ఆయన తన ముఖాన్ని దాచుకుంటే ఆయనను చూడగలవాడెవడు? ఆయన జాతులనైనా వ్యక్తులనైనా ఒకే విధంగా పరిపాలిస్తాడు. 1
30భక్తిహీనులు రాజ్యపాలన చేయకుండా, వారు ప్రజలను ఇకపై చిక్కించుకోకుండా ఆయన చేస్తాడు. 1
31ఒకడు “నేను దోషినే, కానీ ఇకపై పాపం చేయను. 1
32నాకు తెలియని దాన్ని నాకు నేర్పించు. నేను పాపం చేశాను. ఇకపై చేయను” అని దేవునితో చెప్పాడనుకో, 1
33దేవుడు చేస్తున్నది నీకు నచ్చడం లేదు గనక అలాటి మనిషిని దేవుడు శిక్షిస్తాడు అనుకుంటున్నావా? నేను కాదు, నువ్వే నిశ్చయించుకోవాలి. కాబట్టి నీకు తెలిసినది చెప్పు. 1
34వివేచన గలవారు, జ్ఞానంతో నా మాట వినేవారు నాతో ఇలా అంటారు. 1
35యోబు తెలివితక్కువ మాటలు పలుకుతున్నాడు. అతని మాటలు బుద్ధిహీనమైనవి. 1
36యోబు దుష్టులవలె మాట్లాడుతున్నాడు గనక అతనిపై సునిశితమైన విచారణ జరిగితే ఎంత బాగుంటుంది! 1
37అతడు తన పాపానికి తోడుగా ద్రోహం సమకూర్చుకుంటున్నాడు. మన ఎదుట ఎగతాళిగా చప్పట్లు కొట్టి దేవుని మీద కాని మాటలు కుప్పగా పోస్తున్నాడు.