Psalms 37
1చెడ్డ వారిని చూసి నువ్వు క్షోభపడకు. అధర్మంగా ప్రవర్తించే వాళ్ళని చూసి అసూయ పడకు. 1
2ఎందుకంటే వాళ్ళు గడ్డిలాగా త్వరలోనే ఎండిపోతారు. పచ్చటి మొక్కల్లా వాడి పోతారు. 1
3యెహోవాలో నమ్మకం ఉంచు. ఏది మంచిదో దాన్నే చెయ్యి. దేశంలో స్థిరపడి విశ్వసనీయతను ఆచరించు. 1
4తర్వాత యెహోవాలో ఆనందించు. నీ హృదయంలోని ఆశలన్నిటినీ ఆయన తీరుస్తాడు. 1
5నీ జీవిత గమనాన్ని యెహోవాకు అప్పగించు. ఆయనలో నమ్మకముంచు. ఆయన నీ తరుపున పని చేస్తాడు. 1
6పగటి వెలుగులా నీ న్యాయవర్తననూ, మధ్యాహ్నపు వెలుగులా నీ నిర్దోషత్వాన్నీ ఆయన చూపిస్తాడు. 1
7యెహోవా ఎదుట మౌనంగా ఉండు. సహనంతో ఆయన కోసం వేచి ఉండు. దుర్మార్గాలు చేసి ఎవరన్నా విజయం సాధిస్తే చింతించకు. ఎవరన్నా కుట్రలు చేస్తే విచారించకు. 1
8కోపపడకు. నిరుత్సాహపడకు. చింతపడకు. దానివల్ల సమస్యలు కలుగుతాయి. 1
9దుర్మార్గకార్యాలు చేసే వాళ్ళు నిర్మూలం అవుతారు. కానీ యెహోవా కోసం వేచి చూసే వాళ్ళు దేశాన్ని స్వాధీనం చేసుకుంటారు. 1
10ఇక కొద్ది కాలంలోగా దుర్మార్గుడు లేకుండా పోతాడు. అతడున్న స్థలాన్ని నువ్వు ఎంత వెదికినా అతడు కనిపించడు. 1
11నమ్రత గలవాళ్ళు భూమిని స్వాధీనం చేసుకుంటారు. గొప్ప సమృద్ధి కలిగి సంతోషిస్తారు. 1
12దుష్టుడు ధర్మాత్ముడికి వ్యతిరేకంగా కుట్రలు చేస్తాడు. వాడు అతనికి విరోధంగా పళ్ళు కొరుకుతాడు. 1
13వాళ్ళ సమయం అయిపోవచ్చింది కాబట్టి ప్రభువు వాళ్ళను చూసి నవ్వుతాడు. 1
14అణచివేతకి గురైన వాళ్ళనీ పేదలనీ నిరుత్సాహపరచడానికీ, నిజాయితీగా ఉండేవాళ్ళనీ చంపడానికీ దుష్టులు తమ కత్తులు దూశారు. తమ విల్లును వంచారు. 1
15వాళ్ళ కత్తులు వాళ్ళ గుండెల్నే చీల్చివేస్తాయి. వాళ్ళ విల్లులు విరిగిపోతాయి. 1
16దుష్టుల దగ్గర ఉన్న సమృద్ధి కంటే ధర్మాత్ముడి దగ్గర ఉన్న కొంచెమే శ్రేష్ఠమైనది. 1
17దుష్టుల చేతులు విరిగిపోతాయి. కానీ యెహోవా ధర్మాత్ములను కాపాడతాడు. 1
18యెహోవా నిందారహితులను ప్రతిరోజూ కనిపెట్టుకుని ఉంటాడు. వాళ్ళ వారసత్వం నిత్యమూ ఉంటుంది. 1
19రోజులు బాగా లేనప్పుడు వాళ్ళకు అవమానం కలగదు. కరువు కాలంలో వాళ్ళకు చాలినంత ఆహారం ఉంటుంది. 1
20అయితే దుష్టులు నశించిపోతారు. యెహోవా విరోధుల కీర్తి పచ్చిక బయళ్ళ చందంగా ఉంటుంది. వాళ్ళు సమసిపోయి పొగలాగా కనిపించకుండా పోతారు. 1
21దుష్టులు అప్పు చేస్తారు, కానీ తిరిగి చెల్లించరు. కానీ ధర్మాత్ములు దయతో దానం చేస్తారు. 1
22యెహోవా ఆశీర్వదించిన వాళ్ళు భూమిని స్వాధీనం చేసుకుంటారు. ఆయన ఎవరినైతే శపిస్తాడో వాళ్ళు నాశనమౌతారు. 1
23దేవుని దృష్టిలో ఏ వ్యక్తి మార్గం కొనియాడదగ్గదిగా ఉందో ఆ వ్యక్తి నడతను యెహోవా స్థిరపరుస్తాడు. 1
24యెహోవా అతని చెయ్యి పట్టుకుని ఉన్నాడు కాబట్టి అతడు తన మార్గంలో తడబడినా కిందపడడు. 1
25నేను ఒకప్పుడు చిన్నవాడిగా ఉన్నాను. ఇప్పుడు పెద్దవాణ్ణి అయ్యాను. అయితే నీతిమంతుడు అనాథ కావడం గానీ, లేదా అతడి పిల్లలు అడుక్కోవడం గానీ నేను చూడలేదు. 1
26అతడు రోజంతా దయతో అప్పులిస్తూ ఉంటాడు. అతని పిల్లలు ఆశీర్వాదంగా ఉంటారు. 1
27చెడు నుండి మళ్ళుకో. ఏది మంచిదో దాన్ని చెయ్యి. అప్పుడు నువ్వు కలకాలం సురక్షితంగా ఉంటావు. 1
28ఎందుకంటే యెహోవా న్యాయాన్ని ప్రేమిస్తాడు. విశ్వాసంతో తనను అనుసరించే వాళ్ళను ఆయన విడిచిపెట్టడు. వాళ్ళను శాశ్వతంగా భద్రపరుస్తాడు. అయితే దుర్మార్గుల సంతానం నాశనం అవుతుంది. 1
29నీతిమంతులు భూమిని స్వాధీనం చేసుకుంటారు. అక్కడ వాళ్ళు కలకాలం జీవిస్తారు. 1
30నీతిమంతుని నోరు జ్ఞానాన్ని పలుకుతుంది. అది న్యాయాన్ని అధికం చేస్తుంది. 1
31అతని హృదయంలో అతని దేవుని ధర్మశాస్త్రం ఉంది. అతని అడుగులు జారవు. 1
32దుర్మార్గుడు ధర్మాత్ముణ్ణి గమనిస్తూ ఉంటాడు. అతణ్ణి చంపడానికి చూస్తూ ఉంటాడు. 1
33అయితే యెహోవా అతణ్ణి దుష్టుడి చేతిలో వదిలిపెట్టడు. అతనికి తీర్పు జరిగే సమయంలో నేరం మోపడు. 1
34యెహోవా కోసం వేచి ఉండు. ఆయన మార్గాన్ని అనుసరించు. భూమిని స్వాధీనం చేసుకోవడానికి ఆయన నిన్ను లేపుతాడు. దుర్మార్గులు నిర్మూలమైనప్పుడు నువ్వు చూస్తావు. 1
35భీకరుడైన దుర్మార్గుడు స్వంత నేలలో పెరిగిన పెద్ద పచ్చని చెట్టులా విస్తరించడం నేను చూశాను. 1
36అయితే నేను ఆ దారిన వెళ్ళినప్పుడు నేను వాడి కోసం చూశానుగానీ వాడు నాకు కనిపించలేదు. 1
37చిత్తశుద్ధి కలిగిన వ్యక్తిని గమనించు. యథార్ధంగా ఉండే వాణ్ణి కనిపెట్టు. శాంతి కోసం జీవించేవాడికి మంచి భవిష్యత్తు ఉంటుంది. 1
38పాపులు సమూలంగా నాశనం అవుతారు. దుర్మార్గుడికి భవిష్యత్తు ఉండదు. 1
39నీతిపరులకు యెహోవా దగ్గరనుండే ముక్తి కలుగుతుంది. వేదన సమయంలో ఆయన వాళ్ళను కాపాడతాడు. 1
40యెహోవా వాళ్ళని దుర్మార్గుల బారినుంచి రక్షిస్తాడు. ఎందుకంటే వాళ్ళు ఆయనలో ఆశ్రయం పొందారు.