Psalms 9
1హృదయ పూర్వకంగా నేను యెహోవాకు ధన్యవాదాలు చెల్లిస్తాను. యెహోవా, నీ ఆశ్చర్య కార్యాలన్నిటి గురించి నేను చెబుతాను. 1
2మహోన్నతుడైన యెహోవా! నేను నీ గురించి సంతోషించి హర్షిస్తాను. నీ నామానికి స్తుతి కీర్తన పాడుతాను. 1
3నా శత్రువులు వెనుదిరిగినప్పుడు, వాళ్ళు తొట్రుపడి నీ ఎదుట నాశనం అవుతారు. 1
4ఎందుకంటే, నా న్యాయయుక్తమైన పనిని నువ్వు సమర్థించావు. నీ సింహాసనం మీద ఒక నీతిగల న్యాయమూర్తిగా నువ్వు కూర్చున్నావు. 1
5నీ యుద్ధ నినాదంతో అన్యజాతులను నువ్వు భయభీతులను చేశావు. నువ్వు దుర్మార్గులను నాశనం చేశావు. వాళ్ళ జ్ఞాపకాలను శాశ్వతంగా తుడిచివేశావు. 1
6తమ పట్టణాలను నువ్వు జయించినప్పుడు శిథిలాలు కూలినట్టు శత్రువు కూలిపోయాడు. వాళ్ళ గుర్తులన్నీ చెరిగిపోయాయి. 1
7కాని యెహోవా శాశ్వత కాలం ఉంటాడు. న్యాయం తీర్చడానికి ఆయన తన సింహాసనాన్ని స్థాపిస్తాడు. 1
8యెహోవా లోకానికి న్యాయమైన తీర్పు తీరుస్తాడు. జాతుల కోసం న్యాయమైన నిర్ణయాలు చేస్తాడు. 1
9పీడిత ప్రజలకు యెహోవా బలమైన ఆశ్రయం. ఆపత్కాలంలో బలమైన అండ. 1
10యెహోవా, నీ నామం తెలిసిన వాళ్ళు నిన్ను నమ్ముతారు. ఎందుకంటే, నిన్ను వెదికే వాళ్ళను నువ్వు విడిచిపెట్టవు. 1
11సీయోనులో ఏలుతున్న యెహోవాకు స్తుతులు పాడండి. ఆయన చేసిన వాటిని జాతులకు చెప్పండి. 1
12ఎందుకంటే, రక్తపాతానికి శాస్తి చేసే దేవుడు గుర్తుపెట్టుకుంటాడు. పీడిత ప్రజల కేకలు ఆయన మరచిపోడు. 1
13యెహోవా, నా మీద దయ చూపించు. నన్ను ద్వేషించేవాళ్ళు నన్ను ఎలా పీడిస్తున్నారో చూడు. మరణద్వారం నుంచి నన్ను తప్పించగలిగిన వాడివి నువ్వే. 1
14నీ స్తుతి నేను ప్రచురం చేసేలా నన్ను తప్పించు. సీయోను కుమార్తె ద్వారాల్లో నీ రక్షణలో హర్షిస్తాను! 1
15జాతులు తాము తవ్విన గుంటలో తామే పడిపోయారు. తాము రహస్యంగా పన్నిన వలలో వారి కాళ్ళే చిక్కాయి. 1
16యెహోవా తనను ప్రత్యక్షం చేసుకున్నాడు. తీర్పును ఆయన అమలు చేశాడు. దుర్మార్గుడు తన క్రియల్లో తానే చిక్కుకున్నాడు. సెలా. 1
17దుర్మార్గులను తిప్పి పాతాళానికి పంపడం జరుగుతుంది. దేవుణ్ణి మరిచిన జాతులన్నిటికీ అదే గతి. 1
18అక్కరలో ఉన్నవాణ్ణి తప్పకుండా జ్ఞాపకం చేసుకోవడం జరుగుతుంది. పీడిత ప్రజల ఆశలు శాశ్వతంగా చెదిరిపోవడం జరగదు. 1
19యెహోవా లేచి రా, మనుషులకు మా మీద జయం కలగనివ్వకు. నీ సముఖంలో జాతులకు తీర్పు వస్తుంది గాక. 1
20యెహోవా, వాళ్ళను భయభీతులకు గురిచెయ్యి. తాము కేవలం మానవమాత్రులేనని జాతులు తెలుసుకుంటారు గాక. సెలా.